Gudihathnoor: ఆదివాసీలపై అటవీ అధికారుల పాశవిక దాడి ఘోరం దౌలత్ రావు ఆగ్రహం
Gudihathnoor: ఇందన్‌పెల్లి అటవీ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన ఆదివాసీ యువకులపై ఫారెస్ట్ అధికారులు జరిపిన దాడిని ఆదివాసీ సేనా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోవ దౌలత్ రావు తీవ్రంగా ఖండించారు.
Gudihathnoor: ఆదివాసీలపై అటవీ అధికారుల పాశవిక దాడి ఘోరం దౌలత్ రావు ఆగ్రహం
గుడిహత్నూర్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్‌పెల్లి అటవీ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన ఆదివాసీ యువకులపై అటవీ శాఖ అధికారులు పాశవికంగా దాడి చేయడాన్ని ఆదివాసీ సేనా తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.
ఈ సందర్భంగా ఆదివాసీ సేనా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోవ దౌలత్ రావు మాట్లాడుతూ.. ఈ నెల 2వ తేదీన చేపలు పట్టేందుకు వెళ్లిన యువకులను వేటకు వెళ్తున్నారనే సాకుతో అటవీ అధికారులు దారుణంగా కొట్టి, రహస్య ప్రాంతానికి తరలించి నిర్బంధించడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు.
గతంలో కూడా నిర్మల్ జిల్లా కడేం మండలంలోని ఎల్లాపూర్, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు ఆదివాసీలపై, మహిళలపై ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడ్డారని ఆయన గుర్తుచేశారు.
రోజురోజుకూ అటవీ అధికారుల ఆగడాలు పెరిగిపోతున్నాయని, ఆదివాసీలను వారి భూముల నుండి వెళ్లగొట్టేందుకే ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దిన్నోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం అటవీ అధికారుల ద్వారా ఆదివాసీలపై దాడులు చేయించడం సరికాదన్నారు.
ఈ ఘటనకు బాధ్యులైన అటవీ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, గాయపడిన యువకులకు ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించడంతో పాటు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ, ప్రజా సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.




