Pebbair: పెబ్బేరులో పోలీసుల తనిఖీలు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు సీజ్!

Pebbair: వనపర్తి జిల్లా పెబ్బేరులో పోలీసుల మెరుపు తనిఖీలు. నెంబర్ ప్లేట్లు లేని 70కి పైగా వాహనాలు గుర్తింపు,

G. BALAVARDHAN, PEBBERU
Published on: 10 July 2026 1:25 PM IST
Pebbair
X

Pebbair: పెబ్బేరులో పోలీసుల తనిఖీలు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు సీజ్!

Pebbair: వనపర్తి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై పోలీసులు ప్రత్యేక తనిఖీ కార్యక్రమం చేపట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట, సుభాష్ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 70కి పైగా వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనంతరం వాహనదారులకు రహదారి భద్రత, మోటారు వాహన చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించారు. నిబంధనలకు అనుగుణంగా నూతన నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయించి, వాటి ప్రాధాన్యాన్ని వివరించిన తర్వాత వాహనాలను విడుదల చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో వివిధ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు మొత్తం రూ.50 వేల వరకు జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ, నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని అన్నారు. ఇలాంటి వాహనాలను నేర కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ముఖ్యంగా దొంగతనాలు, ఇతర నేరాల దర్యాప్తులో నెంబర్ ప్లేట్లు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు.

అలాగే హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేసి, మోటారు వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

పోలీస్ శాఖకు సంబంధం లేని వ్యక్తులు తమ వాహనాలపై "POLICE" అని, అలాగే మీడియాకు సంబంధం లేని వారు "PRESS" అని స్టిక్కర్లు లేదా బోర్డులు ఏర్పాటు చేసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అలాంటి వాహనాలు గుర్తించినట్లయితే వాటిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

అదేవిధంగా నెంబర్ ప్లేట్లపై అనుమతి లేని డిజైన్లు, చిత్రాలు, గుర్తులు లేదా చదవడానికి ఇబ్బంది కలిగించే విధంగా రాతలు ఉండకూడదని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా స్పష్టంగా కనిపించే నెంబర్ ప్లేట్లను మాత్రమే ఉపయోగించాలని వాహనదారులకు సూచించారు.

ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, నెంబర్ ప్లేట్లు, హెల్మెట్ వంటి భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్సై వెంకటేశ్వర్లు గౌడ్ కోరారు. ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో ఎస్సై దివ్యారెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU

Next Story