Devarakadra: కౌకుంట్లలో 20 ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ.. బీఆర్‌ఎస్‌పై ఎమ్మెల్యే ఫైర్
Devarakadra: కౌకుంట్లలో రైతులకు 20 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాటకాలను ప్రజలు నమ్మరని ధ్వజమెత్తారు.
Devarakadra: కౌకుంట్లలో 20 ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ.. బీఆర్‌ఎస్‌పై ఎమ్మెల్యే ఫైర్
Devarakadra: రైతుల క్షేమం కొరకే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి . మధుసూదన్ రెడ్డి అన్నారు.ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడక ఎండల ప్రభావంతో వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయని, అదేవిధంగా లో వోల్టేజ్ సమస్యతో రైతులు ఇబ్బంది పడకూడదని రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేయడం జరిగిందని కౌకుంట్ల లో ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ కార్యక్రమంలో తెలిపారు.
రాష్ట్రమంతటా విద్యుత్ వినియోగం పెరిగిందని ఎండలు పెరగడంతో విద్యుత్ వాడకం ఎక్కువైందని అన్నారు. గతంలోనే రైతులకు వర్షాభావ ఆరుతడి పంటలు వేసుకోవాలని తెలిపామన్నారు. ఇంతవరకే దేవరకద్ర చిన్నచింతకుంట మండలాల రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేయడం జరిగిందని, నేడు కౌకుంట్ల మండల రైతులకు 20 ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగానే పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇదివరకు పడ్డ కొద్ది వర్షాలతో కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించి అటు నుంచి రైతుల అవసరాలకు వదిలామని అన్నారు.
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో దేవరకద్ర నియోజకవర్గం లో వివిధ అభివృద్ధి పనులకు 1000 కోట్ల వరకు నిధులు తీసుకువచ్చి పనులు కొనసాగిస్తున్నామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల క్షేమం కొరకు అహర్నిశలు కష్టపడుతుంటే, పనిలేని ప్రతిపక్షాలు వాళ్ళ ఉనికి కోసం వేస్తున్న నాటకాలు, వేషాలు హీరో కమల్ హాసన్ ని మించిపోయేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
పది సంవత్సరాలుగా దోచుకున్న డబ్బులతో అసెంబ్లీకి రాకుండా మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ వీరి వేషాలను గమనిస్తున్నారని దుయ్యపట్టారు. వీళ్లు ఎన్ని వేషాలు వేసిన ప్రజలు బిఆర్ఎస్ ను నమ్మే పరిస్థితిలో లేరని, 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కిషన్ రావు, మండల అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, సర్పంచ్ నరేష్, మాజీ కురుమూర్తి దేవస్థానం చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఓబిసి ఆంజనేయులు, ముచ్చింతల సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి , పెబ్బేటి గోవర్ధన్ రెడ్డి ,విద్యుత్ అధికారులు, వివిధ గ్రామాల రైతులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




