Kalwakurthy: మినీ స్టేడియానికి మహర్దశ.. రూ. 1.30 కోట్లతో ఆధునీకరణ!

Kalwakurthy: మినీ స్టేడియం అభివృద్ధికి రూ.1.30 కోట్లు మంజూరు. ఆగస్టు 3న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపిన మున్సిపల్ చైర్‌పర్సన్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 31 July 2026 12:21 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: మినీ స్టేడియానికి మహర్దశ.. రూ. 1.30 కోట్లతో ఆధునీకరణ!

నాగర్ కర్నూల్ జిల్లా

కల్వకుర్తి పట్టణ కేంద్రంలో క్రీడాకారులకు ఎంతో కాలంగా ఉన్న కల నేడు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా పాలనలో నెరవేరబోతోందని కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్ పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి సీతారాం నాయక్ తో కలిసి కల్వకుర్తి మినీ స్టేడియాన్ని మున్సిపాలిటీ చైర్ పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ సందర్శించారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్ పర్సన్ మాట్లాడుతూ పదేళ్ల పాటు అభివృద్ధికి నోచుకోని కల్వకుర్తి మినీ స్టేడియం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరైన 1కోటి 30లక్షల నిధులతో త్వరలోనే ఆధునిక సౌకర్యాలతో కొత్త రూపు సంతరించుకోనుందని తెలిపారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్వకుర్తి మినీ స్టేడియం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని క్రీడాకారులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో యువత తమ ప్రతిభను నిరూపించుకునేందుకు తగిన వేదిక లేక ఇబ్బందులు పడ్డారని జిల్లా,రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లాలంటే ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు.

కల్వకుర్తి మినీ స్టేడియం అభివృద్ధి సమస్యకు చరమగీతం పాడేందుకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచన మేరకు కల్వకుర్తి మినీ స్టేడియం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి 30 లక్షల నిధులను మంజూరు చేసిందని ఈ నిధులతో స్టేడియంలో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్, ప్రహరీ గోడ నిర్మాణం,ఫ్లడ్ లైట్లు, డ్రెస్సింగ్ రూంలు, తాగునీటి సౌకర్యం,క్రీడా పరికరాల గది తదితర ఆధునిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

ఆగస్టు 3న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన...

కల్వకుర్తి మినీ స్టేడియం అభివృద్ధి పనులకు ఆగస్టు 3న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.క్రీడల అభివృద్ధే లక్ష్యంగా కల్వకుర్తి మినీ స్టేడియం అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి స్టేడియాన్ని క్రీడాకారులకు

అందుబాటులోకి తీసుకురావాలని ఆమె అధికారులను ఆదేశించారు.

క్రీడాకారుల్లో ఆనందం...

కల్వకుర్తి మినీ స్టేడియం అభివృద్ధి పనులకు నోచుకోవడంతో కల్వకుర్తి, చుట్టుపక్కల మండలాలకు చెందిన క్రీడాకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కల్వకుర్తి మినీ స్టేడియంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కల్వకుర్తి ప్రాంతం నుండి వెలువడే అవకాశం ఉందని యువత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ వెంట మున్సిపాలిటీ కౌన్సిలర్లు షేక్ ఏజాస్, కొల్లోజు రాజేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుస్తకాల రాహుల్,ఏఈ సంతోష్ కుమార్, ఫుట్ బాల్ శిక్షకుడు వెంకటరాములు, గుత్తేదారు ప్రవీణ్ కుమార్,క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సుధాకర్,నవీన్,సీనియర్ క్రీడాకారులు జహీర్,మహేష్ రెడ్డి,చెన్నకేశవులు,భాను, యువజన కాంగ్రెస్ నాయకులు అఖిల్, పడకంటి వెంకటేష్,దున్న సురేష్,నవీన్,తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story