Weight Loss Tips: బరువు తగ్గడానికి వాకింగ్.. రన్నింగ్‌లో ఏది బెస్ట్.. పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

Weight Loss Tips: బరువు తగ్గడానికి వాకింగ్, రన్నింగ్‌లో ఏది ఉత్తమమైనదో తెలుసుకోండి. హార్వర్డ్ మెడికల్ స్కూల్, జర్నల్ ఆఫ్ ఒబేసిటీ నివేదికల ప్రకారం.. తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు కరిగించడానికి రన్నింగ్ ఉపయోగపడితే, కీళ్ల నొప్పులు ఉన్నవారికి, దీర్ఘకాలిక ఫిట్‌నెస్ కోసం 'బ్రిస్క్ వాకింగ్' ఎలా మేలు చేస్తుందో ఈ స్టోరీలో చదవండి.

Ganesh
Published on: 20 March 2026 5:18 PM IST
Weight Loss Tips
X

Weight Loss Tips

Weight Loss Tips: ఫిట్‌నెస్ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది రన్నింగ్. వ్యాయామం ఎంత కష్టంగా ఉంటే ఫలితం అంత త్వరగా ఉంటుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే, అందరికీ పరుగెత్తడం సాధ్యం కాదు. మోకాళ్ల నొప్పులు, ఊపిరి అందకపోవడం లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల చాలామంది నడకకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో బరువు తగ్గడానికి వాకింగ్, రన్నింగ్‌లో ఏది బెస్ట్ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

'జర్నల్ ఆఫ్ ఒబేసిటీ' ప్రచురించిన కథనం ప్రకారం, ఒకే దూరాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. నడిచే వారి కంటే పరుగెత్తే వారు వేగంగా బరువు తగ్గుతారు. దీనికి ప్రధాన కారణం రన్నింగ్ చేయడం వల్ల శరీర శ్రమ ఎక్కువగా ఉండటమే. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నివేదిక ప్రకారం.. సుమారు 70 కిలోల బరువున్న వ్యక్తి 30 నిమిషాల పాటు పరుగెత్తితే 300 కేలరీలు ఖర్చవుతాయి. అదే వ్యక్తి అంతే సమయం వేగంగా నడిస్తే (Brisk Walking) కేవలం 140 నుంచి 160 కేలరీలు మాత్రమే కరుగుతాయని వెల్లడించింది.

పరుగుతో పోలిస్తే నడకలో తక్కువ కేలరీలు ఖర్చవుతాయని తెలిసినంత మాత్రాన అది తక్కువ ప్రభావవంతమైనదని భావించలేం అని నిపుణులు చెబుతున్నారు. రన్నింగ్ చేసే వారు త్వరగా అలసిపోయి వ్యాయామాన్ని ఆపేసే అవకాశం ఉంది. కానీ నడకను ఎక్కువ సేపు, ఎక్కువ రోజుల పాటు కొనసాగించవచ్చని అంటున్నారు. అధిక బరువు ఉన్నవారికి లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి పరుగు వల్ల గాయాలయ్యే ప్రమాదం ఉందని, అలాంటి వారికి వేగంగా నడవడం (Brisk Walking) అనేది అత్యంత సురక్షితమైన, ఉత్తమమైన మార్గంగా సూచిస్తున్నారు.

ఏది బెస్ట్..

మీ లక్ష్యం తక్కువ సమయంలో వేగంగా బరువు తగ్గడం అయితే పరుగు సరైన ఎంపిక అని, కానీ, మీరు వ్యాయామాన్ని భారంగా భావించకుండా, జీవితాంతం క్రమం తప్పకుండా కొనసాగించాలనుకుంటే నడక మేలైనదని నిపుణులు సూచిస్తున్నారు. మీరు రోజుకు 45 నుంచి 60 నిమిషాల పాటు వేగంగా నడిస్తే, తక్కువ సమయం పరుగెత్తడం ద్వారా వచ్చే ఫలితాలను సులభంగా పొందవచ్చని చెబుతున్నారు. ఏ వ్యాయామం చేసినా నిలకడగా చేయడం, దాంతో పాటు సరైన ఆహార నియమాలు పాటించడం ముఖ్యం అని చెప్పారు.

Ganesh

Ganesh

Next Story