రైతులకు మేలు చేయడమే కాదు.. పంటను కాపాడే అరుదైన పక్షి.. అదేంటంటే.?

Ramadasu pakshi: వ్యవసాయంలో ఎలుకలు, పురుగుల బెడదతో బాధపడుతున్నారా? అయితే 'అడవి రామదాసు'గా పిలుచుకునే ఈ అరుదైన పక్షి గురించి మీరు తెలుసుకోవాలి.

Ravi
By Ravi
Published on: 31 May 2026 6:38 PM IST
Ramadasu pakshi
X

రైతులకు మేలు చేయడమే కాదు.. పంటను కాపాడే అరుదైన పక్షి.. అదేంటంటే.?

Ramadasu pakshi: వ్యవసాయం చేయడం ఒక ఎత్తైతే, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చీడపీడల నుంచి కాపాడుకోవడం రైతులకు మరో పెద్ద సవాలు. ఎలుకలు, మిడతలు, గొంగళి పురుగులు పంట పొలాలపై పడితే రైతన్నల కష్టం మొత్తం నిలువునా నాశనం అవుతుంది. వీటిని అరికట్టడానికి రైతులు ఎన్నో రకాల పురుగు మందులు విరివిగా వాడుతుంటారు. కానీ, ప్రకృతిలోనే వీటికి ఒక అద్భుతమైన పరిష్కారం దాగి ఉందని మీకు తెలుసా? మన రైతన్నలకు ఎలాంటి ఖర్చు లేకుండా సహజ సిద్ధంగా ఎంతో సహాయం చేసే ఒక అందమైన నేస్తం ఉంది. దాని పేరే 'రామదాసు పక్షి'. మన గిరిజన ప్రాంతాల్లో దీనిని ముద్దుగా 'అడవి రామదాసు' అని కూడా పిలుచుకుంటారు. ఈ పక్షిని, ఇంగ్లీష్ బాషలో బ్లాక్ వింగ్డ్ కైట్, బ్లాక్ షోల్డర్డ్ కైట్ అని రకరకాలుగా అంటారు.

చూడటానికి అచ్చం గుడ్లగూబ ముఖకవళికలను పోలి ఉండే ఈ పక్షి, ఒక అద్భుతమైన వేటగాడు. గాలిలో ఎగురుతూ ఒకేచోట కదలకుండా నిశ్చలంగా ఉండగలగడం దీనికి ఉన్న ఒక అతిపెద్ద ప్రత్యేకత. అలా గాలిలో ఉంటూనే చాలా సులువుగా కింద పొలాల్లో దాగి ఉన్న ఎలుకలు, పాములు, మిడతలు, గొంగళి పురుగులను సులభంగా పసిగడుతుంది. క్షణాల వ్యవధిలో చాలా వేగంగా కిందికి దూకి వాటిని అమాంతం తన నోట కరుచుకుని భుజిస్తుంది. ఈ విధంగా రైతుల పంటలను నాశనం చేసే శత్రువులను ఇది బలి తీసుకుంటూ, వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆసక్తికరమైన విషయాలను మహబూబ్ నగర్‌లోని ఎం.వి.ఎస్ ప్రభుత్వ అటానమస్ కళాశాల జంతుశాస్త్ర విభాగం డాక్టర్ బక్షి రవీందర్ ఇటీవల అందరికీ తెలిపారు.

ఈ అందమైన రామదాసు పక్షి శాస్త్రీయ నామం ఎల్ ఎనస్ ఆక్సిలరీస్. ఇది ప్రధానంగా ఆక్సిపిట్రిడే అనే ప్రత్యేక కుటుంబానికి చెందినది. సాధారణంగా ఈ పక్షులు ఆఫ్రికా, దక్షిణాసియా లాంటి దేశాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మన భారతదేశంలో కూడా సిక్కిం, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఇవి చాలా అధికంగా సంచరిస్తూ ఉంటాయి. ఎక్కడైతే పచ్చని పంట పొలాలు, ఎత్తైన చెట్లు ఉంటాయో కచ్చితంగా అక్కడ ఇవి తమ నివాసం ఏర్పరచుకుంటాయి. మన పర్యావరణ వ్యవస్థలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. రామదాసు పక్షి లాంటి అరుదైన జీవులు సామాన్య రైతుల పాలిట నిజమైన వరాలు. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అలాగే రసాయనాల విపరీతమైన వాడకం వల్ల ఇలాంటి ఎన్నో జాతుల పక్షులు నేడు కనుమరుగైపోతున్నాయి. వీటిని కాపాడుకోవడం మనందరి కనీస బాధ్యత.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story