Obesity Awareness: గుండెపోటు నుంచి క్యాన్సర్ వరకు.. స్థూలకాయం తెచ్చిపెట్టే దీర్ఘకాలిక ముప్పులివే!

Obesity Awareness: స్థూలకాయం అనేది కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు, అది అనేక ప్రాణాంతక వ్యాధులకు మూలం. గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం, కిడ్నీ సమస్యలు, ఫ్యాటీ లివర్, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Ganesh
Published on: 27 March 2026 1:50 PM IST
Obesity Awareness
X

Obesity Awareness: గుండెపోటు నుంచి క్యాన్సర్ వరకు.. స్థూలకాయం తెచ్చిపెట్టే దీర్ఘకాలిక ముప్పులివే!

Obesity Awareness: ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, ప్రస్తుతం భారతదేశంలో కూడా స్థూలకాయం ఒక తీవ్రమైన ఆరోగ్య సంక్షోభంగా మారుతోంది. మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. కేవలం బరువు పెరగడమే కాదు, ఇది ప్రాణాంతక వ్యాధులకు రహదారిగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది. అధిక బరువు అనేది కేవలం శారీరక రూపానికి సంబంధించింది కాదు. ఇది శరీరంలోని దాదాపు ప్రతి అవయవ వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది. సరైన సమయంలో అప్రమత్తం కాకపోతే, ఇది జీవన నాణ్యతను తగ్గించడమే కాకుండా ప్రాణాపాయానికి దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థూలకాయంతో వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శరీరంలో, ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకుపోయే అధిక కొవ్వు వల్ల రక్తపోటు (BP), కొలెస్ట్రాల్ పెరుగుతాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశాలను గణనీయంగా పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు ఉన్నవారిలో 'ఇన్సులిన్ రెసిస్టెన్స్' ఏర్పడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి టైప్-2 మధుమేహం వస్తుంది. ఇది క్రమంగా కిడ్నీ వ్యాధులు, నరాల బలహీనత, దృష్టి లోపాలకు కారణమవుతుందని వెల్లడించారు. అలాగే అధిక బరువు వల్ల మోకాళ్లు, నడుము, కీళ్లపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కాలక్రమేణా 'ఆస్టియో ఆర్థరైటిస్' వంటి నొప్పులు వచ్చి కదలికలు కష్టమవుతాయని చెబుతున్నారు.

స్థూలకాయం వల్ల శరీరంలో కలిగే హార్మోన్ల అసమతుల్యత, దీర్ఘకాలిక వాపుల వల్ల రొమ్ము, కోలన్, కిడ్నీ, కాలేయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. మద్యపానం చేయని వారిలో కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే 'నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్' రావడానికి ప్రధాన కారణం స్థూలకాయమే అని చెబుతున్నారు. ఇది ముదిరితే కాలేయం దెబ్బతిని లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అధిక బరువు వల్ల నిద్రలో ఊపిరి సరిగ్గా అందకపోవడం వంటి సమస్యలు వస్తాయని అన్నారు. దీనివల్ల తీవ్రమైన అలసట, అధిక రక్తపోటు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. అధిక బరువు అనేది కేవలం శారీరకమే కాదు, మానసికంగా కూడా కుంగదీస్తుందని అన్నారు. సమాజంలో వివక్ష ఎదుర్కోవడం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, ఆత్మన్యూనతా భావం ఏర్పడే అవకాశం ఉందన్నారు. శరీరంలో అధిక కొవ్వు వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని, దీనివల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా సోకడం, గాయాలు ఆలస్యంగా మానడం వంటి సమస్యలు ఎదురవుతాయని చెప్పారు.

స్థూలకాయం అనేది మనం అనుకున్న దానికంటే ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య అని నిపుణులు హెచ్చరించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఈ ముప్పుల నుంచి బయటపడవచ్చని సూచించారు.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story