Lifestyle: భారత జెన్‌జీ తమ డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలుసా.?
Lifestyle: భారత్‌లో యువత వినియోగపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి.
Lifestyle: భారత జెన్‌జీ తమ డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలుసా.?
Lifestyle: భారత్‌లో యువత వినియోగపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని Gen Zగా పిలుస్తారు. ఈ తరం ఇప్పుడు కేవలం జనాభాలో ఒక వర్గంగా కాకుండా దేశ వినియోగ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన శక్తిగా మారింది. ఇంతకీ తరం తమ డ్బుబను ఎక్కువగా ఎక్కడ ఖర్చు చేస్తుందో తెలుసా.?
దేశ వినియోగ మార్కెట్‌పై Gen Z ప్రభావం ఎంత?
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG), స్నాప్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం.. భారత్‌లో 1997-2012 మధ్య జన్మించిన Gen Z జనాభా సుమారు 37.7 కోట్లు. దేశంలోని మొత్తం వినియోగ వ్యయంలో ఈ తరం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దాదాపు 43 శాతం ప్రభావం చూపుతున్నట్లు నివేదిక పేర్కొంది.
అంటే సుమారు 860 బిలియన్ డాలర్ల భారత వినియోగ వ్యయంలో Gen Z ప్రభావం దాదాపు 370 బిలియన్ డాలర్ల మేర ఉందని అంచనా. రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రభావం మరింత పెరగనుంది. 2035 నాటికి Gen Z వినియోగ వ్యయం 2 ట్రిలియన్ డాలర్లకు పైగా చేరే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి.
అదే సమయంలో దేశ మొత్తం వినియోగ వ్యయం సుమారు 3.9 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని BCG అంచనా వేసింది. ప్రస్తుతం Gen Zలో ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే ఉద్యోగం చేస్తున్నారు. 2030 నాటికి ఉద్యోగాల్లో ఉన్న వారి వాటా 36 శాతానికి, 2035 నాటికి 47 శాతానికి చేరుతుందని అంచనా.
సొంత డబ్బు కాకపోయినా.. కొనుగోళ్లపై ప్రభావం ఎక్కువే!
Gen Z ఖర్చు చేసే మొత్తం డబ్బు వారి సొంత ఆదాయం నుంచే వస్తుందని అనుకోవడం సరికాదు. ప్రస్తుతం ఈ తరం వినియోగిస్తున్న సుమారు 860 బిలియన్ డాలర్లలో 660 బిలియన్ డాలర్ల వరకు కుటుంబ సభ్యుల ఆదాయంతో సంబంధం ఉన్న ఖర్చే అని నివేదిక అంచనా వేస్తోంది. అంటే కుటుంబంపై ఆధారపడే Gen Z సభ్యులు తమకు కావాల్సిన బ్రాండ్, యాప్, రెస్టారెంట్ లేదా ఇతర ఉత్పత్తిని ఎంపిక చేస్తారు.
ఆ ఖర్చును తల్లిదండ్రులు భరిస్తారు. అందుకే వీరి కొనుగోలు నిర్ణయాలు కుటుంబ ఖర్చులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. అయితే ఈ పరిస్థితి భవిష్యత్తులో మారనుంది. Gen Zలో ఎక్కువ మంది ఉద్యోగాల్లోకి వచ్చి స్వయంగా సంపాదించడం ప్రారంభించిన తర్వాత వారి కొనుగోలు శక్తి భారీగా పెరుగుతుంది.
2035 నాటికి ఈ తరం చేసే ఖర్చులో 93 శాతం వరకు వారి సొంత ఆదాయం నుంచే వచ్చే అవకాశం ఉందని అంచనా. అయితే దేశంలో వినియోగం పెరగడానికి Gen Z ఒక్కటే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న ఆదాయాలు, వేగంగా విస్తరిస్తున్న పట్టణ జనాభా కూడా ఈ మార్పునకు ముఖ్యమైన కారణాలే.
ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్ నుంచి బ్యూటీ వరకు..
Gen Z ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్న రంగాల్లో ఫ్యాషన్, ఫుట్‌వేర్, బయట భోజనం, వినోదం, ప్రయాణం, OTT సబ్స్క్రిప్షన్లు ముఖ్యమైనవి. BCG-Snap నివేదిక ప్రకారం.. ఈ విభాగాల్లో భారతీయులు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో దాదాపు సగం వరకు Gen Z కొనుగోలు నిర్ణయాల ప్రభావం ఉంటోంది. బ్యూటీ, పర్సనల్ కేర్ కూడా Gen Zకి ముఖ్యమైన విభాగాలుగా మారుతున్నాయి.
Redseer నివేదిక ప్రకారం.. 2030 నాటికి భారత్‌లో బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్ దాదాపు 40 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆన్లైన్ బ్యూటీ విక్రయాల్లో క్విక్ కామర్స్ వాటా సుమారు 15 శాతంగా ఉంది. 2030 నాటికి ఇది దాదాపు 40 శాతానికి చేరవచ్చని అంచనా. అదే సమయంలో బ్యూటీ ఉత్పత్తులపై జరిగే మొత్తం ఖర్చులో దాదాపు సగం Gen Z, Gen Alpha నుంచి వచ్చే అవకాశం ఉందని Redseer అంచనా వేస్తోంది.
ఇక స్కిన్‌కేర్ విషయంలోనూ ఈ తరం ఆలోచనా విధానం మారింది. కేవలం బ్రాండ్ పేరు చూసి కొనుగోలు చేయడం కంటే.. ఉత్పత్తిలో ఏ పదార్థాలు ఉన్నాయి? ఫార్ములేషన్ ఎలా ఉంది? నిజంగా ఎంత ప్రభావం చూపుతుంది? వంటి విషయాలను పరిశీలిస్తోంది.
ఖర్చు మాత్రమే కాదు.. చిన్న వయసులోనే పెట్టుబడుల వైపు అడుగులు
Gen Z ఎక్కువగా ఖర్చు చేస్తోందని మాత్రమే చూస్తే అసలు చిత్రం పూర్తిగా అర్థం కాదు. ఈ తరం చిన్న వయసులోనే పెట్టుబడులపై కూడా ఆసక్తి చూపుతోంది. IBEF పేర్కొన్న RBI డేటా ప్రకారం.. 30 ఏళ్లలోపు స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల వాటా 2019 మార్చిలో 22.6 శాతం ఉండగా, 2025 జూలై నాటికి అది 38.9 శాతానికి పెరిగింది. దీంతో పెట్టుబడిదారుల సగటు వయసు 38 ఏళ్ల నుంచి 33 ఏళ్లకు తగ్గింది.
మిలీనియల్స్, Gen Z కలిపి భారత మ్యూచువల్ ఫండ్ ఆస్తుల్లో దాదాపు 48 శాతం వాటాను కలిగి ఉన్నట్లు IBEF పేర్కొంది. అలాగే ట్రాన్స్ యూనియన్ సిబిల్ నివేదిక ప్రకారం.. 2024లో భారత్‌లో తొలిసారి క్రెడిట్ తీసుకున్న వారిలో Gen Z వాటా 41 శాతంగా ఉంది. అంటే ఈ తరం చిన్న వయసులోనే క్రెడిట్, పెట్టుబడులు, ఆర్థిక సేవలను ఉపయోగించుకోవడం ప్రారంభిస్తోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. Gen Zలో స్వయంగా నిర్ణయాలు తీసుకునే ధోరణి ఎక్కువగా ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సమాచారాన్ని త్వరగా తెలుసుకుని పెట్టుబడులు లేదా కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. అయితే వేగంగా నిర్ణయం తీసుకోవడం కంటే సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జ్యువెలరీ, స్కిన్కేర్లోనూ Gen Z కొత్త ట్రెండ్ తీసుకొస్తోంది
Gen Z ప్రభావం నగల మార్కెట్‌పైనా కనిపిస్తోంది. గతంలో పెళ్లిళ్లు, ప్రత్యేక కార్యక్రమాల కోసం భారీ డిజైన్ల నగలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు తేలికగా ఉండే, రోజూ ధరించగలిగే, ఆధునిక డిజైన్ల నగలపై యువత ఆసక్తి పెరుగుతోంది. కొటాక్ మ్యూచువల్ ఫండ్ పరిశోధన ప్రకారం.. Gen Zలో సరసమైన ధరలో లభించే లైట్‌వెయిట్ జ్యువెలరీకి డిమాండ్ పెరుగుతోంది. పనిచేసే మహిళల సంఖ్య పెరగడం కూడా ఈ మార్కెట్‌కు ఊతమిస్తోంది.
ఇదే మార్పు కారణంగా లైఫ్‌స్టైల్ జ్యువెలరీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఉదాహరణకు బ్లూస్టోన్ తన ఫోకస్‌ను భారీ బ్రైడల్ జ్యువెలరీ నుంచి రోజువారీ ఉపయోగానికి అనువైన డిజైన్ ఆధారిత నగల వైపు మళ్లించింది. ఈ విభాగం 2029 వరకు ఏడాదికి 16-18 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
స్కిన్కేర్లోనూ వినియోగదారుల ప్రాధాన్యతలు మారాయి. ప్రస్తుతం 74 శాతం మంది వినియోగదారులు ఉత్పత్తులపై ఉన్న ఇన్‌గ్రిడియెంట్ లేబుళ్లను చదువుతున్నారు. మెరుగైన ఫార్ములేషన్ కోసం గత ఆరు నెలల్లో 44 శాతం మంది అదనంగా డబ్బు ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ అదనపు ఖర్చులో ఎక్కువ మంది 10 శాతం లేదా అంతకంటే తక్కువ పెరుగుదలకే పరిమితమవుతున్నారు.




