Fridge Cleaning Tips: ఫ్రిజ్ క్లీన్ చేసేప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా..? ప్రాణాలకే ప్రమాదం!
Fridge Cleaning Tips: సాధారణంగా చాలామంది ఫ్రిజ్ క్లీన్ చేసేటప్పుడు పక్కనే ఉన్న బోర్డులో కేవలం స్విచ్ ఆఫ్ చేసి పని కానిచ్చేస్తుంటారు.
Fridge Cleaning Tips: ఫ్రిజ్ క్లీన్ చేసేప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా..? ప్రాణాలకే ప్రమాదం!
Fridge Cleaning Tips: ప్రతి ఇల్లాలు వారాంతంలో లేదా పండగల సమయంలో ఇల్లు సర్దుకుంటూ ఫ్రిజ్‌ను కూడా శుభ్రం చేయడం సర్వసాధారణం. అయితే, నిత్య జీవితంలో మనం చేసే అతి చిన్న నిర్లక్ష్యం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక హృదయవిదారక ఘటనే దీనికి నిదర్శనం. ఒక మహిళ తన ఇంట్లోని ఫ్రిజ్ లోపల ఉన్న పదార్థాలన్నీ బయటకు తీసి, సాఫీగా క్లీన్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఊహించని విధంగా భారీ విద్యుత్ షాక్‌కు గురై వెనక్కి పడిపోయింది. ఈ సీసీటీవీ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరి గుండె ఒక్కసారిగా జారిపోతోంది. ఈ నేపథ్యంలో ఫ్రిజ్ క్లీన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ తప్పులు అస్సలు చేయకూడదో ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం.
చాలామంది చేసే ఆ ఒక్క తప్పు.. కేవలం స్విచ్ ఆఫ్ చేయడం..!
సాధారణంగా చాలామంది ఫ్రిజ్ క్లీన్ చేసేటప్పుడు పక్కనే ఉన్న బోర్డులో కేవలం స్విచ్ ఆఫ్ చేసి పని కానిచ్చేస్తుంటారు. మరికొందరైతే అసలు స్విచ్ కూడా ఆఫ్ చేయకుండానే లోపల ఉన్న అరలను తడి గుడ్డతో తుడుస్తుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరమైన పని. కొన్నిసార్లు మీ ఇంట్లోని వైరింగ్‌లో ఎర్తింగ్ లోపం ఉండటం వల్ల, కేవలం స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ ఫ్రిజ్ బాడీకి కరెంట్ సరఫరా అయ్యే అవకాశం ఉంది. అందువల్ల, శుభ్రం చేయడానికి కనీసం 15 నిమిషాల ముందే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి, సాకెట్ నుంచి ప్లగ్‌ను పూర్తిగా బయటకు తీసేయడం చాలా ముఖ్యం.
నీళ్లను నేరుగా చల్లడం, తడి చేతులతో తాకడం..
ఫ్రిజ్ లోపల కూరగాయల మరకలు లేదా జిడ్డు పేరుకుపోయిందని చాలామంది నీళ్లను లోపలికి చల్లి కడుగుతుంటారు. ఫ్రిజ్ లోపల బల్బులు, థర్మోస్టాట్ రెగ్యులేటర్ వంటి విద్యుత్ భాగాలు ఉంటాయి. వాటిలోకి నీరు చేరితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం వంద శాతం ఉంటుంది.
నిపుణుల సూచన: ఫ్రిజ్ లోపలి భాగాలను తుడవడానికి ఎక్కువ నీటిని ఉపయోగించవద్దు. మైక్రోఫైబర్ క్లాత్‌ను లేదా మెత్తటి కాటన్ గుడ్డను కొద్దిగా తడిపి (డ్యాంప్ క్లాత్) దాంతో మాత్రమే తుడవాలి. ముఖ్యంగా లైట్లు, వైరింగ్ ఉన్న చోట అస్సలు నీరు తగలనివ్వకూడదు.
కాళ్లకు చెప్పులు లేకుండా అసలు ముట్టుకోవద్దు..
ఇంట్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను, ముఖ్యంగా ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, గీజర్ వంటి వాటిని శుభ్రం చేస్తున్నా లేదా రిపేర్ చేస్తున్నా కాళ్ళకు రబ్బరు లేదా ప్లాస్టిక్ చెప్పులు ధరించడం తప్పనిసరి. ఎందుకంటే, ఒకవేళ అనుకోకుండా ఎక్కడైనా కరెంట్ లీకేజ్ ఉన్నా, కాళ్లకు చెప్పులు ఉండటం వల్ల అది భూమిలోకి ఎర్తింగ్ కాకుండా అడ్డుకుంటుంది. దీంతో భారీ ప్రమాదం నుంచి మన ప్రాణాలు కాపాడుకోవచ్చు. అలాగే క్లీన్ చేసే సమయంలో నేల తడిగా లేకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం.
ఫ్రిజ్ వెనుక వైరింగ్‌పై కన్నేయండి..
చాలా కాలం పాటు ఫ్రిజ్ ఒకే చోట ఉండటం వల్ల దాని వెనుక భాగంలో ఉండే కాయిల్స్, కంప్రెసర్ దగ్గర విపరీతంగా దుమ్ము పేరుకుపోతుంది. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఏవైనా వైర్లు ఎలుకలు కొరకడం వల్ల తెగిపోయి ఉన్నాయా? లేదా ప్లాస్టిక్ కోటింగ్ ఊడిపోయిందా? అనేది నిశితంగా గమనించాలి. ఒకవేళ వైర్లు పాడైతే సొంత ప్రయోగాలు చేయకుండా, వెంటనే ఒక సర్టిఫైడ్ టెక్నీషియన్‌ను పిలిపించి బాగు చేయించుకోవడం ఉత్తమం.




