Water: దాహం వేసిన‌ప్పుడు మాత్ర‌మే నీళ్లు తాగుతున్నారా.? మీ కిడ్నీలు ప్ర‌మాదంలో ప‌డుతున్న‌ట్లే

Water: నీరు ఎప్పుడు తాగుతాం.? అదేం ప్ర‌శ్న దాహం వేసిన‌ప్పుడు తాగుదాం అనే అంటారు క‌దూ! అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కేవ‌లం దాహం వేసిన‌ప్పుడు మాత్ర‌మే నీరు తాగుతామంటే కుద‌ర‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Mokshith
Updated on: 11 April 2026 12:01 PM IST
Water
X

Water

Water: నీరు ఎప్పుడు తాగుతాం.? అదేం ప్ర‌శ్న దాహం వేసిన‌ప్పుడు తాగుదాం అనే అంటారు క‌దూ! అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కేవ‌లం దాహం వేసిన‌ప్పుడు మాత్ర‌మే నీరు తాగుతామంటే కుద‌ర‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

దాహం వేసిన‌ప్పుడు నీరు తాగితే..

చాలామంది దాహంగా ఉన్న‌ప్పుడు మాత్రమే నీళ్లు తాగడం సరిపోతుందని అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం దాహం అనిపించే సమయానికి శరీరం ఇప్పటికే కొంత మేర డీహైడ్రేషన్‌కు గురై ఉంటుంది. ఈ సమయంలో కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. శరీరంలో నీటి స్థాయి తగ్గిపోతే రక్తాన్ని శుభ్రపరచడం కిడ్నీలకు కష్టంగా మారుతుంది. అందుకే రోజంతా కొద్దికొద్దిగా నీళ్లు తాగడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

చాయ్, కాఫీ తాగితే సరిపోతుందని భావించడం పెద్ద పొరపాటు

కొంతమంది రోజంతా చాయ్, కాఫీ లేదా జ్యూస్ తాగితే అది కూడా నీళ్లే అని భావిస్తారు. కానీ ఇవి నిజానికి శరీరానికి అవసరమైన నీటి అవసరాన్ని పూర్తిగా తీర్చవు. ముఖ్యంగా కాఫీ లేదా టీ వంటి కేఫిన్ ఉన్న పానీయాలు శరీరంలో నీటిని మరింత త్వరగా బయటకు పంపించే అవకాశముంది. అందుకే వీటిని నీటి ప్రత్యామ్నాయంగా భావించకూడదని నిపుణులు చెబుతున్నారు.

చాలా ఎక్కువగా నీళ్లు తాగడం కూడా ప్రమాదమే

కొంతమంది ఆరోగ్యం కోసం ఎక్కువగా నీళ్లు తాగడం మంచిదని అనుకుంటారు. కానీ తక్కువ సమయంలో మూడు నుంచి నాలుగు లీటర్లకు పైగా నీళ్లు తాగితే అది కూడా ప్రమాదకరం. ఇలా ఎక్కువగా నీళ్లు తాగితే రక్తంలో సోడియం స్థాయి తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని హైపోనాట్రేమియా అంటారు. తీవ్రమైన పరిస్థితుల్లో ఇది మెదడుపై ప్రభావం చూపి వాపు, మూర్చలు లేదా కోమా వంటి సమస్యలకు కూడా కారణం కావచ్చు.

కిడ్నీ ఆరోగ్యం గురించి డాక్టర్లు ఏమంటున్నారు?

నిపుణుల అభిప్రాయం ప్రకారం కిడ్నీలకు సరైన మోతాదులో నీరు అవసరం. చాలా తక్కువగా లేదా చాలా ఎక్కువగా నీళ్లు తాగడం రెండూ ప్రమాదకరం. తక్కువగా నీళ్లు తాగితే మూత్రం గాఢంగా మారుతుంది. దీని వల్ల కిడ్నీ రాళ్లు, మూత్ర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే డయాబెటిస్ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ద్రవాలు తీసుకుంటే శరీరంపై అదనపు ఒత్తిడి పడే ప్రమాదం కూడా ఉంది.

రోజుకు ఎంత నీరు తాగాలి?

చాలామంది రోజుకు ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగాలనే నియమాన్ని అనుసరిస్తారు. కానీ ఇది ప్రతి ఒక్కరికీ ఒకేలా వర్తించదు. సాధారణంగా మహిళలకు రోజుకు సుమారు 2.2 లీటర్ల ద్రవాలు, పురుషులకు సుమారు 3 లీటర్ల ద్రవాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది వాతావరణం, శారీరక శ్రమ, వ్యాయామం, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి మారుతుంది. మూత్రం రంగు కూడా శరీరంలో నీటి స్థితిని తెలియజేస్తుంది. లైట్ ప‌సుపు రంగు సరైన హైడ్రేషన్‌కు సూచన కాగా, చాలా గాఢంగా ఉంటే నీటి లోపం ఉన్నట్లు అర్థం. పూర్తిగా పారదర్శకంగా ఉంటే అవసరానికి మించిన నీరు తీసుకున్నట్టు భావించవచ్చు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు వైద్యుల స‌ల‌హాల‌కు ప్ర‌త్యామ్నాయం కాద‌ని గుర్తించాలి. ఆరోగ్యానికి సంబంధించినంత వ‌ర‌కు డాక్ట‌ర్ల సూచ‌న‌లు పాటించ‌డ‌మే మంచిది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story