మెదడు వేగంగా ముసలిదవుతుందా? ఈ వ్యాధులు కారణమంటున్న అధ్యయనం
అల్జీమర్స్, మద్యం వ్యసనం, స్కిజోఫ్రేనియా వంటి వ్యాధులతో బాధపడేవారిలో మెదడు వేగంగా వృద్ధాప్యానికి గురవుతుందని తాజా అధ్యయనం తెలిపింది.
Brain Ageing
మెదడు వేగంగా వృద్ధాప్యానికి గురవడం అనేది కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతంగా ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా అల్జీమర్స్, మైల్డ్ కాగ్నిటివ్ ఇంపెయిర్‌మెంట్ (MCI), మద్యం వ్యసనం, అలాగే స్కిజోఫ్రేనియా వంటి మానసిక రుగ్మతలు ఉన్నవారిలో మెదడు సాధారణ వయస్సు కంటే వేగంగా వృద్ధాప్య లక్షణాలను చూపిస్తుందని పరిశోధకులు గుర్తించారు.
చైనాలోని నాన్జింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. ఇందులో ప్రపంచంలోని పలు బ్రెయిన్ ఇమేజింగ్ డేటాబ్యాంక్‌ల నుంచి 45,900 మంది ఆరోగ్యవంతుల ఎంఆర్ఐ (MRI) స్కాన్‌లను, అలాగే వివిధ మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 2,698 మంది రోగుల ఎంఆర్ఐ డేటాను విశ్లేషించారు.
పరిశోధనలో అల్జీమర్స్, మైల్డ్ కాగ్నిటివ్ ఇంపెయిర్‌మెంట్ (MCI), స్కిజోఫ్రేనియా, బైపోలార్ డిజార్డర్, మేజర్ డిప్రెషన్, మద్యం, పొగాకు వ్యసనం, ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ (ASD), అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ (ADHD) వంటి పరిస్థితులను పరిశీలించారు.
శరీర వయస్సుతో పోలిస్తే మెదడు ఎంత వేగంగా వృద్ధాప్యానికి గురవుతోందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు 'ప్రెడిక్టివ్ ఏజ్ డిఫరెన్స్ (PAD)' అనే ప్రమాణాన్ని ఉపయోగించారు. ఈ విలువ ఎక్కువగా ఉంటే మెదడు సాధారణం కంటే వేగంగా వృద్ధాప్యానికి చేరుకుంటోందని అర్థమని వివరించారు.
అధ్యయనంలో అల్జీమర్స్, మైల్డ్ కాగ్నిటివ్ ఇంపెయిర్‌మెంట్ ఉన్నవారిలో అత్యధికంగా మెదడు వృద్ధాప్య లక్షణాలు కనిపించాయి. మద్యం వ్యసనం, స్కిజోఫ్రేనియా వంటి మానసిక రుగ్మతలున్న వారిలో కూడా మెదడు వయస్సు వేగంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. అయితే ADHD, ASD ఉన్నవారిలో ఆరోగ్యవంతులతో పోలిస్తే పెద్దగా తేడాలు కనిపించలేదని పరిశోధకులు వెల్లడించారు.




