Kurnool: కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్రస్థాయి ఈఎన్టీ సదస్సు ప్రారంభం
Kurnool: కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్రస్థాయి ఈఎన్టీ సదస్సు ప్రారంభమైంది. మొదటి రోజు ఆధునిక శస్త్రచికిత్సలపై వైద్యులకు ప్రత్యక్ష శిక్షణ వర్క్‌షాప్‌లు నిర్వహించారు.
Kurnool: కర్నూలు మెడికల్ కాలేజీలో రాష్ట్రస్థాయి ఈఎన్టీ సదస్సు ప్రారంభం
కర్నూలు: కర్నూలు మెడికల్ కాలేజీలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఈఎన్టీ (ENT) సదస్సులో భాగంగా మొదటి రోజు ప్రీ-కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌లు, పీజీ విద్యార్థుల పేపర్ ప్రజెంటేషన్లు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సదస్సుకు 514 మంది వైద్యులు, ఈఎన్టీ నిపుణులు నమోదు చేసుకొని హాజరయ్యారు.
మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఈఎన్టీ వైద్యరంగంలో ఆధునిక శస్త్రచికిత్సా పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై వైద్యులకు ప్రత్యక్ష శిక్షణ అందించే విధంగా ఐదు ప్రత్యేక ప్రీ-కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌లు నిర్వహించారు.
వీటిలో మ్యానికిన్స్, షీప్ లంగ్, పిగ్ లంగ్‌పై బ్రాంకోస్కోపీ శిక్షణ, షీప్ హెడ్‌పై ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, షీప్ హెడ్‌పై కోబ్లేషన్ శిక్షణ, ఫేషియల్ ప్లాస్టిక్స్–FACE-IT, మ్యానికిన్స్‌పై సియాలెండోస్కోపీ వంటి అంశాలపై ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఈ శిక్షణలు వైద్యులకు ఆచరణాత్మకంగా, ఆధునిక వైద్య సాంకేతికతను పరిచయం చేసే విధంగా సాగాయి.
అదేవిధంగా పీజీ విద్యార్థులకు 76 కేస్ ప్రజెంటేషన్లు, 34 కేస్ సిరీస్ ప్రజెంటేషన్లు జరిగాయి. వివిధ క్లిష్టమైన ఈఎన్టీ కేసులపై విద్యార్థులు తమ అధ్యయనాలు, వైద్య అనుభవాలను నిపుణుల సమక్షంలో ప్రజెంట్ చేశారు.
ఈ రాష్ట్రస్థాయి సదస్సు ద్వారా ఈఎన్టీ వైద్యరంగంలో వస్తున్న ఆధునిక చికిత్సా విధానాలు, శస్త్రచికిత్సా పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్యులకు అందించడంతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి హాజరైన నిపుణుల మధ్య వైద్య పరిజ్ఞానం, అనుభవాల పరస్పర మార్పిడి జరుగుతోంది.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంఈ & హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మెడికల్ కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్, ఏపీఎంసీ అబ్జర్వర్ డాక్టర్ సింగరి ప్రభాకర్, ఏపీఎంసీ చైర్మన్ డాక్టర్ నందకిశోర్, స్టేట్ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ మరియు కర్నూలు మెడికల్ కాలేజీ ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ హరిక్రిష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జయప్రకాశ్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ మహేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.




