Srisailam: టైగర్ రిజర్వ్ పరిధిలో ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం!
Srisailam: అటవీ శాఖ ఆధ్వర్యంలో గ్లోబల్ టైగర్ డే సందర్భంగా డిప్యూటీ రేంజ్ అధికారులు కిషోర్ కుమార్, మదన్ కుమార్ నేతృత్వంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Srisailam: టైగర్ రిజర్వ్ పరిధిలో ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం!
శ్రీశైలం: గ్లోబల్ టైగర్ డే- సందర్భంగా శ్రీశైలం రేంజ్ పరిధిలోని సున్నిపెంట గ్రామంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పులుల సంరక్షణపై విద్యార్థులలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జూలై 28నా వివిధ విద్యా సంస్థల్లో విద్యార్థులకు డ్రాయింగ్ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పులుల సంరక్షణ, అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యత తదితర అంశాలపై తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు పూర్తిగా సహకరించారు. బుధవారం గ్లోబల్ టైగర్ డే సందర్భంగా సున్నిపెంటలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు అటవీ శాఖ అధికారులు కలిసి పులుల సంరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
విద్యార్థులు పులుల సంరక్షణ, అడవుల రక్షణ, వన్యప్రాణుల పరిరక్షణకు సంబంధించిన నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీ ఈ. కిషోర్ కుమార్ మరియు శ్రీ కె.మదన్ కుమార్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మాట్లాడుతూ, పులుల సంరక్షణపై విద్యార్థులలో ఎంతో మంచి స్పందన రావడం అభినందనీయమని అన్నారు. పులి కేవలం ఒక వన్యప్రాణి మాత్రమే కాదని, అడవి పర్యావరణ వ్యవస్థలో అత్యున్నత స్థాయి మాంసాహారిగా కీలక పాత్ర పోషించే గొప్ప జీవి అని వివరించారు.
పులుల ఉనికి అడవి ఆరోగ్యం, జీవవైవిధ్యం మరియు పర్యావరణ సమతుల్యతకు ఒక ముఖ్యమైన సూచికగా ఉంటుందని తెలిపారు. పులుల సంరక్షణ అంటే కేవలం పులులను కాపాడటం మాత్రమే కాదని, పులుల ఆవాసమైన అడవులను, నీటి వనరులను, వేట జంతువులను మరియు మొత్తం జీవవైవిధ్యాన్ని సంరక్షించడం అని వారు వివరించారు. అడవులు రక్షించబడితేనే పులులు, ఇతర వన్యప్రాణులు మనుగడ సాగించగలవని, అదే సమయంలో అడవులు మనకు స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణ సమతుల్యత వంటి అనేక పర్యావరణ ప్రయోజనాలను అందిస్తాయని తెలిపారు.
గ్లోబల్ టైగర్ డే ప్రతి సంవత్సరం జూలై 29న పులుల సంరక్షణపై ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిర్వహించబడుతుందని, పులుల సంఖ్యను పెంచడంతో పాటు వాటి సహజ ఆవాసాలను కాపాడటం, అక్రమ వేటను అరికట్టడం, వన్యప్రాణుల పట్ల ప్రజల్లో బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొందించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
ప్రత్యేకంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, "నేటి విద్యార్థులే రేపటి పర్యావరణ పరిరక్షకులు. ప్రకృతిని, అడవులను, వన్యప్రాణులను ప్రేమించే భావన చిన్ననాటి నుంచే పెంపొందించుకోవాలి" అని అన్నారు. పులుల సంరక్షణలో విద్యార్థులు, యువత మరియు స్థానిక ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని తెలిపారు. సున్నిపెంటలో నిర్వహించిన ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో పులుల సంరక్షణతో పాటు అడవులు, వన్యప్రాణులు మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన మరింత పెరిగిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ అధికారులు పి. శ్రీరాములు, ఆర్.బాలాజీ. ప్రొటెక్షన్ వాచర్లు. గంగుమాల సుభాష్. ఊదర గిరి. శివ నాగేంద్ర. రామ్ తుల్లా. శ్యాం బాబు. విజయ్ కుమార్. శ్రీకాంత్. గురవయ్య. శీను. వెంకటేశం. నాగరాజు. జావిద్. సురేష్. తదితరులు అటవీ శాఖ అధికారులు, పాఠశాలలు మరియు కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




