Dhone: వినాయక చవితి వేడుకల్లో డీజేలకు నో: డోన్ డీఎస్పీ శ్రీనివాసులు

Dhone: వినాయక చవితి వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని, సంప్రదాయ పద్ధతుల్లో ఉత్సవాలు నిర్వహించే మండపాలకు బహుమతులు అందిస్తామని డోన్ డీఎస్పీ తెలిపారు.

Bharat Raj, Dhone
Published on: 11 Sept 2026 9:22 PM IST
Dhone
X

Dhone: వినాయక చవితి వేడుకల్లో డీజేలకు నో: డోన్ డీఎస్పీ శ్రీనివాసులు

డోన్: వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని డోన్ డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డోన్ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వినాయక చవితి సందర్భంగా డీజేలకు పూర్తిగా అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకల సమయంలో నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వినాయక నిమజ్జనం రోజున భక్తులు, నిర్వాహకులు మరింత అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. ముఖ్యంగా నిమజ్జనం సమయంలో ఒకరిపై ఒకరు కెమికల్ పౌడర్లు చల్లుకోవడం వల్ల కళ్లకు తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. కెమికల్ పౌడర్లను ఉపయోగించకుండా సంప్రదాయ పద్ధతుల్లో వేడుకలు నిర్వహించాలని కోరారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

డోన్ పట్టణంలో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి, శాంతియుతంగా వేడుకలు నిర్వహించే మండపాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయ పద్ధతుల్లో వినాయక చవితి వేడుకలు నిర్వహించే వారికి బహుమతులతో పాటు విందు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. నిమజ్జనం కోసం అవసరమైన వాహనాలు, విద్యుత్, భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయో ముందుగానే పరిశీలించుకోవాలని తెలిపారు. పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని డీఎస్పీ శ్రీనివాసులు కోరారు.

Bharat Raj, Dhone

Bharat Raj, Dhone