Nandyala: యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ పాఠాలు.. తొలి ప్రయత్నంలోనే దొరికిన దొంగ!
Nandyala: నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన ఉప్పరిపేట చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు.
Nandyala: యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ పాఠాలు.. తొలి ప్రయత్నంలోనే దొరికిన దొంగ!
Nandyala: చెడు వ్యసనాలు పెరిగిన అప్పులు కుటుంబ పోషణ భారం ఇవన్నీ కలిసి ఓ వ్యక్తిని నేర మార్గంలోకి నెట్టాయి. ఈజీగా డబ్బు సంపాదించాలని భావించిన అతడు యూట్యూబ్ వీడియోలు చూసి చైన్ స్నాచింగ్‌కు ప్లాన్ వేశాడు. కానీ తొలి ప్రయత్నంలోనే పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
నంద్యాల పట్టణంలోని ఉప్పరిపేట బ్రాహ్మణ వీధిలో ఓ ఇంటి వద్ద ఉన్న “టు లెట్” బోర్డు చూసి ఇంటిని చూడాలని వచ్చినట్టు నటించాడు ఆగంతకుడు. ఇంటి యజమానురాలు చరితతో మాట్లాడుతున్న సమయంలో ఆమెను మభ్యపెట్టి, మెడలో ఉన్న సుమారు రూ.4 లక్షల విలువైన మూడున్నర తులాల బంగారు చైన్ లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో సీసీఎస్, టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఘటన స్థల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు… నిందితుడు వచ్చిన బైక్ నంబర్ ఆధారంగా కీలక సమాచారం సేకరించారు. దర్యాప్తులో నిందితుడు మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి శివకృష్ణగా గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, అపహరించిన బంగారు చైన్‌తో పాటు ఘటనలో ఉపయోగించిన పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యానికి బానిసైన శివకృష్ణ… తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాడు. కుటుంబ పోషణ కూడా భారంగా మారడంతో త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేర మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒంటరిగా ఉన్న మహిళల నుంచి చైన్ స్నాచింగ్ ఎలా చేయాలో యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. తొలి ప్రయత్నంగానే ఉప్పరిపేటలో చోరీకి పాల్పడిన అతడు… చివరికి పోలీసుల వలలో చిక్కి జైలుపాలయ్యాడు.
టెక్నాలజీని మంచికి ఉపయోగించాల్సిన చోట నేరాలకు వాడితే ఫలితం ఇదేనని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.




