Nandyal: నంద్యాల జిల్లాలో NIA విచారణ కలకలం

Nandyal: నంద్యాల జిల్లాలో ఎన్‌ఐఏ అధికారుల తనిఖీలు. మావోయిస్టు నేత నామాల జయమ్మ అలియాస్ అరుణ బంధువులను విచారించిన ఎన్‌ఐఏ. వీఆర్వో నుంచి వివరాల సేకరణ.

R Pavankalyan, Nandyal
Published on: 1 Aug 2026 2:11 PM IST
Nandyal
X

Nandyal: నంద్యాల జిల్లాలో NIA విచారణ కలకలం

నంద్యాల: నంద్యాల జిల్లాలో ఎన్‌ఐఏ అధికారుల విచారణ కలకలం రేపింది. గడివేముల మండలం, బండి ఆత్మకూరు మండలం పరమటూరు గ్రామాల్లో మావోయిస్టు నేత నామాల జయమ్మ అలియాస్ అరుణకు సంబంధించిన వివరాలను ఎన్‌ఐఏ అధికారులు సేకరించారు. ఈ సందర్భంగా జయమ్మ తల్లిదండ్రులు, బంధువులను విచారించడంతో పాటు స్థానిక వీఆర్వో నుంచి కీలక సమాచారాన్ని నమోదు చేసుకున్నారు.

గడివేములకు చెందిన నామాల జయమ్మకు, బండి ఆత్మకూరు మండలం పరమటూరుకు చెందిన నామాల భాస్కర్‌తో వివాహం జరిగింది. అనంతరం ఇద్దరూ మావోయిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై నల్లమల అడవుల్లోకి వెళ్లి ఉద్యమంలో చేరారు. అయితే, భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో భాస్కర్ పోలీసులకు లొంగిపోయాడు.

2007లో నల్లమల ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు బలహీనపడటంతో జయమ్మ తన సహచరులతో కలిసి ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. కాగా, సుమారు ఎనిమిదేళ్ల క్రితం భాస్కర్ అనారోగ్యంతో మృతి చెందాడు.

ఇక రెండేళ్ల క్రితం కేరళ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జయమ్మ మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలో కేరళ ప్రభుత్వం, మావోయిస్టు పార్టీ కూడా ఆమె మృతిని ధృవీకరించినట్లు సమాచారం. జయమ్మ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినప్పటికీ వారు స్పందించలేదని తెలుస్తోంది.

అయితే, తాజాగా ఎన్‌ఐఏ అధికారులు విచారణ చేపట్టడంతో జయమ్మ నిజంగా మృతి చెందిందా? లేక ఇంకా జీవించి ఉందా? అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి...

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story