Nandyal: కలెక్టరేట్‌ను వెంటనే ఖాళీ చేయాలి – కలెక్టర్‌కు ప్రజా సంఘాల వినతి

Nandyal: నంద్యాల కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆర్ఏఆర్ఎస్ స్థలం నుంచి ఖాళీ చేయాలని కలెక్టర్ రాజకుమారికి ప్రజా సంఘాల ఐక్య వేదిక వినతిపత్రం అందజేసింది.

R Pavankalyan, Nandyal
Published on: 24 Aug 2026 2:11 PM IST
Nandyal
X

Nandyal: కలెక్టరేట్‌ను వెంటనే ఖాళీ చేయాలి – కలెక్టర్‌కు ప్రజా సంఘాల వినతి

నంద్యాల: కలెక్టరేట్ భవనాన్ని ఖాళీ చేయాలంటూ ఏకంగా కలెక్టర్ రాజకుమారికే వినతిపత్రం అందజేశారు ప్రజా సంఘాల ఐక్య వేదిక నేతలు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)లో కలెక్టర్ రాజకుమారిని కలిసి ఐక్య వేదిక నేతలు వై.ఎన్.రెడ్డి, శంకర్‌రెడ్డి, శంకరయ్య, రామచంద్రారెడ్డి వినతిపత్రం అందజేశారు.

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి చెందిన స్థలంలో కేవలం ఏడాది కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన కలెక్టరేట్ భవనాలను ఏర్పాటు చేశారని నేతలు తెలిపారు. అయితే, నాలుగేళ్లు గడిచినా కలెక్టరేట్‌ను అక్కడి నుంచి ఖాళీ చేయలేదని ఆరోపించారు.

కలెక్టరేట్‌ను ఖాళీ చేయకుండా, అదే ప్రాంతంలో మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల వ్యవసాయ పరిశోధనలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని తెలిపారు. వ్యవసాయ పరిశోధనలకు సంబంధించిన రూ.100 కోట్ల నిధులు కూడా వెనక్కి వెళ్లిపోయాయని వివరించారు. కాబట్టి తక్షణమే కలెక్టరేట్‌ను ఖాళీ చేసి, మరో ప్రాంతానికి తరలించాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక నేతలు కలెక్టర్‌ను కోరారు.

అదేవిధంగా, నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండు ఎకరాల స్థలాన్ని టీడీపీ జిల్లా కార్యాలయానికి కేటాయించడం సరికాదని వారు పేర్కొన్నారు. మార్కెట్ యార్డు స్థలాన్ని రాజకీయ పార్టీ కార్యాలయానికి కేటాయిస్తూ జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story