Nandyal: అంగన్‌వాడీలపై నంద్యాల సీఐ వివాదాస్పద వ్యాఖ్యలు

Nandyal: నంద్యాల కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

R Pavankalyan, Nandyal
Published on: 11 July 2026 8:08 AM IST
Nandyal
X

Nandyal: అంగన్‌వాడీలపై నంద్యాల సీఐ వివాదాస్పద వ్యాఖ్యలు

Nandyal: నంద్యాల కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో వందలాది మంది అంగన్వాడీలు కలెక్టరేట్‌ను ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినతిపత్రం స్వీకరించకుండానే వెళ్లిపోయారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో సుమారు 600 మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌ను ముట్టడించారు.

అంగన్వాడీ కార్యకర్తలు సమర్పించేందుకు తీసుకువచ్చిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ స్వీకరించకుండానే వెళ్లిపోయారని ఆరోపించిన నిరసనకారులు, కలెక్టరేట్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

నిరసన సందర్భంగా ఓ అంగన్వాడీ కార్యకర్త, లేడీ కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో లేడీ కానిస్టేబుల్ అంగన్వాడీ కార్యకర్తపై చేయి చేసుకోవడం తో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు.

అంతేకాకుండా, నంద్యాల 3 టౌన్ సీఐ వేణుగోపాల్ అంగన్వాడీలతో దురుసుగా ప్రవర్తించారని, "ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి వచ్చారా? నా వెంట్రుక కూడా పీకలేరు" అంటూ వ్యాఖ్యానించారని సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపించారు.

నంద్యాల 3 టౌన్ సీఐ వేణుగోపాల్‌పై, అలాగే అంగన్వాడీ మహిళపై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న లేడీ కానిస్టేబుల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

నవచేతన సహా వివిధ యాప్‌ల భారం తగ్గించాలని, "సమాన పనికి సమాన వేతనం" అమలు చేయాలని, అలాగే పెన్షన్, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణమే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు.

నంద్యాల కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ఆందోళన ఉద్రిక్తతకు దారితీయగా, పోలీసుల తీరుపై ఆరోపణలు రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story