Nandyal: నంద్యాల యువతకు ఉచిత ఏఐ నైపుణ్య కోర్సులు

Nandyal: నంద్యాలలో ఉచిత నాస్కామ్ ఏఐ కోర్సులను ప్రారంభించిన కలెక్టర్ జి. రాజకుమారి. యువత ఉపాధి కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 18 July 2026 4:19 PM IST
Nandyal
X

Nandyal: నంద్యాల యువతకు ఉచిత ఏఐ నైపుణ్య కోర్సులు

నంద్యాల: ఉచిత నాస్కామ్ డిజిటల్ - ఏఐ నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకొని తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. శనివారం ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో, నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న "డిజిటల్లీ స్కిల్డ్ & ఇండస్ట్రీ రెడీ యూత్ - మిషన్" కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి, జిల్లాలో యువత కోసం కోర్సుల నమోదు ప్రక్రియను ప్రారంభించారు.*

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన లక్ష మంది యువతకు పూర్తిగా ఉచితంగా డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ అందించడంతో పాటు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు పరిశ్రమల గుర్తింపు పొందిన సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలో 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలన్నారు. అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలు, విశ్వవిద్యాలయాల ప్రిన్సిపాళ్లతో సమన్వయం చేసి విద్యార్థుల నమోదు విస్తృతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సెట్కూర్ సీఈఓ కె. వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో "ఏఐ అసెండ్ (AI Ascend)", "ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ" తదితర కోర్సులను నాస్కామ్ నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి కళాశాల నుంచి ఒక ఫ్యాకల్టీ కోఆర్డినేటర్‌తో పాటు ఇద్దరు స్టూడెంట్ అంబాసిడర్లను నామినేట్ చేసి పంపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, జిల్లా ఎంప్లాయిమెంట్ అండ్ స్కిల్ అధికారి సోమ శివారెడ్డి, జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story