Nandyal: రెడ్ క్రాస్ సొసైటీ బలోపేతానికి ఉద్యోగులంతా సభ్యత్వం తీసుకోవాలి
Nandyal: నంద్యాల కలెక్టరేట్‌లో రెడ్ క్రాస్ సొసైటీపై కలెక్టర్ రాజ కుమారి సమీక్ష నిర్వహించారు. ఉద్యోగులందరూ రెడ్ క్రాస్‌లో సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Nandyal: రెడ్ క్రాస్ సొసైటీ బలోపేతానికి ఉద్యోగులంతా సభ్యత్వం తీసుకోవాలి
నంద్యాల: జిల్లాలో రక్తనిల్వలను పూర్తి స్థాయిలో ఉంచాలనే సంకల్పంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగిందని అందుకు సంబంధించి ఉద్యోగులందరూ సభ్యులుగా నమోదు అవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంటుందని జిల్లా కలెక్టర్ జి. రాజ కుమారి గణియా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్ దస్తగిరి, డిఆర్ఓ రామునాయక్, పిజిఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ....జిల్లాలో రక్తనిల్వల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ బలోపేతం కోసం జిల్లా పరిషత్ సిబ్బంది 30 మంది జీవితకాల సభ్యత్యం తీసుకోగా రూ.33 వేలు ఇవ్వడం జరిగిందని, గతంలో కూడా ఎంపిడిఓలు, సూపరింటెండెంట్లు, జిల్లా పరిషత్ సిబ్బంది నుండి మొత్తం 56 మంది జీవితకాల సభ్యత్యం తీసుకోవడం ద్వారా రూ.61,600/- సమకూరడం జరిగిందన్నారు.
రెడ్ క్రాస్ సొసైటీని బలోపేతం చేయడానికి ఉద్యోగులందరూ కేవలం వెయ్యి రూపాయలు చెల్లించి జీవితకాల సభ్యతం తీసుకోవచ్చు అన్నారు. అదే విధంగా వైస్ పాట్రన్ కోసం రూ.12,500/-, పాట్రన్ కోసం రూ.2,5000/- చెల్లించాల్సి ఉంటుందని, గుర్తింపు కార్డు కోసం అదనంగా వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సభ్యత్వం ఉన్న వారికి అతి తక్కువ రుసుముతో రక్తం అందించడం జరుగుతోందన్నారు. అదే విధంగా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అవసరం ఉన్న సేవలు అందించడంతో పాటు అత్యవసర సమయంలో సిపిఆర్ చేయడం, బ్రహ్మోత్సవాల సమయంలో విధులు నిర్వహించడం జరుగుతోందన్నారు.
అంతేకాకుండా జిల్లాలో అందించిన ఉత్తమ వైద్య సేవలకు గాను రాష్ట్ర గవర్నర్ మెరుగైన ఆరోగ్యం అందించాలని సంకల్పంతో "మీ ఇంటికి - మీ డాక్టరు" క్రింద రూ.2 కోట్లతో అంబులెన్స్ హాస్పిటల్ ను పంపడం జరిగిందన్నారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగిందన్నారు. ఈ సర్వీసు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవసరమైన పూర్తి స్థాయి ఆరోగ్య సేవలు అందించడం జరుగుతోందన్నారు. అదే విధంగా డిఆర్ఓ, ఆర్డీఓలు, తహశీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి సభ్యత్వం పెంచేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ కి జాయింట్ కలెక్టర్ ఛైర్మన్‌గా ఉన్న నేపథ్యంలో యువ రక్తదాతలను పెంచేలా డిఈఓ, డివిఈఓ కృషి చేయాలన్నారు.




