Nandyal: వెట్టి చాకిరీ నిర్మూలన చట్టంపై అవగాహనతో సమర్థవంతంగా అమలు చేయాలి

Nandyal: నంద్యాలలో వెట్టి చాకిరీ నిర్మూలన చట్టంపై అధికారులకు శిక్షణ.

V RAMAMOHAN, KURNOOL
Updated on: 4 Sept 2026 2:29 PM IST
Nandyal
X

Nandyal: వెట్టి చాకిరీ నిర్మూలన చట్టంపై అవగాహనతో సమర్థవంతంగా అమలు చేయాలి

నంద్యాల: వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం రూపొందించిన చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, వెట్టి చాకిరీకి గురవుతున్న వారిని గుర్తించి తక్షణమే విముక్తి కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు ఎస్పీ ఖాదర్ బాషా సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశాల మేరకు జిల్లా మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం, 1976పై అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, కార్మిక శాఖ అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, డీఆర్డీఏ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సందర్భంగా వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనకు సంబంధించి చట్టపరమైన నిబంధనలు, వెట్టి చాకిరీ కార్మికులను గుర్తించే విధానం, బాధితులను తక్షణమే వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించే ప్రక్రియ, వారి పునరావాసం తదితర అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు. అలాగే వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన బాధితులకు ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్ర పునరావాస పథకం (Central Rehabilitation Scheme) ద్వారా అందించే సహాయం, పునరావాస చర్యలు, బాధితుల సామాజిక, ఆర్థిక స్థిరత్వానికి చేపట్టాల్సిన చర్యలను వివరించారు. వెట్టి చాకిరీ నిర్మూలన అనేది కేవలం ఒక శాఖకు సంబంధించిన బాధ్యత కాదని, రెవెన్యూ, పోలీస్, కార్మిక, సాంఘిక సంక్షేమ, విద్యా, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు సమన్వయంతో పనిచేయడం ద్వారా మాత్రమే ఈ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించగలమని ఏఎస్పీ ఖాదర్ బాషా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అనుమానాస్పద పరిస్థితులను గుర్తించి, బాధితుల హక్కులను పరిరక్షిస్తూ, చట్ట ప్రకారం వేగవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా వెట్టి చాకిరీ నిర్మూలన చట్టంపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించడంతో పాటు, బాధితులను గుర్తించడం నుంచి విముక్తి, పునరావాసం వరకు చేపట్టాల్సిన చర్యలపై స్పష్టత కల్పించారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story