Nandikotkur: నందికొట్కూరులో వివాహిత అనుమానాస్పద మృతి

Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరులో శివప్రియ అనే వివాహిత అనుమానాస్పద మృతి. అత్తింటివారి వేధింపులే కారణమంటూ తల్లిదండ్రుల ఆరోపణ, పోలీస్ స్టేషన్ ముందు ధర్నా.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 18 Aug 2026 5:07 PM IST
Nandikotkur
X

Nandikotkur: నందికొట్కూరులో వివాహిత అనుమానాస్పద మృతి

నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పలు అనుమానాలకు తావిచ్చింది. అత్తింటివారి వేధింపులే కూతురి మరణానికి కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసు స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు.

పట్టణంలోని సీపీఎం నాయకుడు నాగేశ్వరరావు కుమారుడు శివకుమార్ తో రెండున్నర సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం, జోగుళాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలం, కోనేరు గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మిదేవి దంపతుల నాలుగో కుమార్తె శివప్రియ(27)తో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు.

అయితే వివాహం జరిగినప్పటి నుంచి అల్లుడు శివకుమార్ మద్యానికి బానిసై తమ కుమార్తెను వేధిస్తున్నాడని తండ్రి నాగరాజు ఆరోపించారు. నెల రోజుల క్రితం కూడా చితకబాది పుట్టింటికి పంపించాడని, అప్పుడు పెద్దలు సర్దిచెప్పి మళ్లీ కాపురానికి పంపినట్లు తెలిపారు.

సోమవారం ఉదయం కుమార్తె శివప్రియ తల్లిదండ్రులకు ఫోన్ చేసి "ఆదివారం రాత్రి విద్యుత్ వైరుతో కొట్టారు. వేధింపులు భరించలేకపోతున్నాను. వచ్చి మాట్లాడండి నాన్న" అని ఏడ్చిందని నాగరాజు చెప్పారు. "ధైర్యంగా ఉండమ్మా, సాయంత్రం వచ్చి మాట్లాడుతాను" అని చెప్పి గ్రామం నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని అల్లుడి తమ్ముడు శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు.

హుటాహుటిన వచ్చి చూసేసరికి కుమార్తె మృతదేహం కనిపించిందని, తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని భర్త, అతడి కుటుంబ సభ్యులు కలిసి పథకం ప్రకారం హత్య చేసి, ఉరేసినట్లు చిత్రీకరించారని ఆరోపించారు. ఈ క్రమంలో తమపై కూడా దాడి చేశారని వాపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. .పోలీసులు నిందితులపై కేసును నమోదు చేసేంతవరకు తాము పోలీస్ స్టేషన్ ను వీడే దిలేదని తేల్చి చెప్పిన మృతురాలి తరుపు తల్లితండ్రి మరియు బంధువులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story