Kurnool: భవన నిర్మాణ వ్యర్థాలను వనరులుగా మారుద్దాం: జానర్ధన్ రెడ్డి!
Kurnool: నగరపాలక సంస్థ, ఆస్కీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ (C&D Waste) నిబంధనలు-2025పై అధికారులకు ప్రత్యేక శిక్షణా సదస్సు నిర్వహించారు.
Kurnool: భవన నిర్మాణ వ్యర్థాలను వనరులుగా మారుద్దాం: జానర్ధన్ రెడ్డి!
కర్నూలు: పట్టణాల్లో వేగంగా పెరుగుతున్న నిర్మాణ కార్యకలాపాల నేపథ్యంలో భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను (సి & డి వ్యర్థాలు) శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారానే పరిశుభ్రమైన, కాలుష్యరహిత నగరాలను నిర్మించవచ్చని రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) సెంటర్ డైరెక్టర్ డా. బి. జానర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం నగరంలోని ఎస్‌బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కర్నూలు నగరపాలక సంస్థ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) సంయుక్త ఆధ్వర్యంలో "నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ"పై కమిషనర్ చల్లా ఓబులేసు అధ్యక్షతన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ఎల్‌టీపీలు, మెప్మా స్వయం సహాయక సంఘాల సభ్యులు, టౌన్ ప్లానింగ్, అమెనిటీస్, శానిటేషన్ కార్యదర్శులకు ఒకరోజు నాయకత్వ శిక్షణా సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన డా. బి. జానర్ధన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2025ను సమర్థవంతంగా అమలు చేయాలంటే మున్సిపల్ అధికారులు, ఇంజినీర్లు, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ, అకౌంట్స్, ప్రొక్యూర్‌మెంట్ తదితర విభాగాల మధ్య సమన్వయం అత్యంత అవసరమన్నారు.
పట్టణాల్లో పెరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలతో పాటు నిర్మాణ వ్యర్థాల పరిమాణం కూడా గణనీయంగా పెరుగుతోందని, వీటిని శాస్త్రీయంగా నిర్వహించడంలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
నిర్మాణ పనులు, భవనాల కూల్చివేత వల్ల ఉత్పత్తి అయ్యే కాంక్రీట్, ఇటుకలు, ఇసుక, రాళ్లు, ఇనుము, ఇతర శిథిలాలను రోడ్లు, కాల్వలు, చెరువులు, ఖాళీ స్థలాల్లో వేయడం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఇటువంటి వ్యర్థాలను మూలం వద్దనే వేరు చేసి, శాస్త్రీయంగా సేకరించి, రవాణా చేసి, ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించి రీసైక్లింగ్ చేయడం ద్వారా తిరిగి నిర్మాణ రంగంలో వినియోగించవచ్చన్నారు.
ఈ విధానం సహజ వనరుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చే సర్క్యులర్ ఎకానమీకి దోహదపడుతుందని వివరించారు.నిర్మాణ వ్యర్థాల నిర్వహణలో ప్రజలు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ఇంజినీర్లు, మున్సిపల్ అధికారులు సమాన బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
ఎక్కడపడితే అక్కడ నిర్మాణ వ్యర్థాలను వేయకుండా నగరపాలక సంస్థ సూచించిన విధానాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. నిర్మాణ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు నగర పరిశుభ్రతను కాపాడుకోవచ్చని, భవిష్యత్తు తరాలకు మెరుగైన జీవన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.
కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ.. నగరంలో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. నిర్మాణ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రజలు, నిర్మాణదారులు నగరపాలక సంస్థ నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. వ్యర్థాల శాస్త్రీయ సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ వ్యవస్థలను మరింత బలోపేతం చేసి పరిశుభ్రమైన, పర్యావరణహిత కర్నూలు నగర నిర్మాణానికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు.
ఈ శిక్షణలో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2025, సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ సాంకేతికతలు, నగర స్థాయి అమలు వ్యూహాలు, ఆర్థిక నిర్వహణ, ఉత్తమ విధానాలపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలవుతున్న విజయవంతమైన నమూనాలను వివరించి, వాటిని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఆస్కీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. అంకూర్ పరాషర్, జీహెచ్‌ఎంసీ రిటైర్డ్ ఎస్‌ఈ కోటేశ్వరరావు, పాలసీ అండ్ స్ట్రాటజీ నిపుణుడు శ్యాం రాథోడ్, రాష్ట్ర సహాయ వనరుల కేంద్రం (ఎస్‌ఎస్‌ఆర్‌సీ) డైరెక్టర్ రఘు బెజవాడ, రెండో పోలీస్ పటాలం అసిస్టెంట్ కమాండెంట్ మహబూబ్ బాషా, నగరపాలక సూపరింటెండింగ్ ఇంజినీర్ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, ఏసీపీ నాగరాజు, అకౌంట్స్ ఆఫీసర్ రఘునందన్, ఎంఈలు మనోహర్ రెడ్డి, గిరిరాజ్ తదితరులు పాల్గొన్నారు.




