Kurnool: ధరిత్రికి రక్షణ కవచం మనమే.. కర్నూలు గురుకులంలో భూ దినోత్సవ వేడుకలు

Kurnool: కర్నూలులోని గురుకుల పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 22 April 2026 3:59 PM IST
Kurnool
X

Kurnool: ధరిత్రికి రక్షణ కవచం మనమే.. కర్నూలు గురుకులంలో భూ దినోత్సవ వేడుకలు

కర్నూలు: ప్రపంచ ధరిత్రి దినోత్సవం' సందర్భంగా షెడ్యూల్ తెగల బాలికల గురుకుల పాఠశాల కర్నూలు నందు జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు మరియు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ 1970 నుంచి ప్రారంభమైన ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 190 కంటే ఎక్కువ దేశాల్లో ఏప్రిల్ 22న జరుపుకుంటున్నాయని,భూగోళంపై మానవ ప్రభావాన్ని తెలియజేయడం, అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది ‘మన శక్తి, మన గ్రహం" అనే నినాదంతో ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.

మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దీనికి ఆధారం భూమి. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యమవుతుందని,వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుందన్నారు. అంతులేని ఆధిపత్య దాహం వల్ల భూగోళంపై హరితదనం తగ్గిపోవడం, కొన్ని రకాల జీవరాశులు నశించిపోవడం వల్ల భూతాపం పెరుగుతూ వస్తోంది. నానాటికీ పెరుగుతున్న భూతాపంతో ప్రకృతి సమతౌల్యత దెబ్బతిని జీవరాశి మనుగడకు ముప్పు ఏర్పడుతోందన్నారు.

వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మరియు పర్యావరణాన్ని రక్షించడానికి పునరుత్పాదక ఇంధనం వైపు ప్రపంచం మారాల్సిన అవసరాన్ని వివరించారు. పర్యావరణ మార్పు కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి దైనందిన జీవితంలో తీసుకునే చర్యల ద్వారానే సాధ్యమవుతుందని తెలియచేశారు. చెట్లు నాటడం, నీరు మరియు ఇంధనాన్ని పొదుపు చేయడం, అలాగే రీసైక్లింగ్ పద్ధతులను పాటించడం ద్వారా మన గ్రహాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలు, వాహనాలు తదితరాల నుంచి వెలువడుతోన్న క్లోరోఫోరో కార్బన్‌లు భూగ్రహాన్ని మరింత వేడెక్కిస్తూ పలు కాలుష్యాలకు కారణమవుతున్నాయన్నారు . బయటకు వెళ్లే సమయంలో వాహనాలు కాకుండా నడిచి వెళ్ళడం లేదా సైకిల్‌ను ఎంచుకోవడం. దూర ప్రాంతాలకు వెళ్లటేప్పుడు స్వంత వాహనాలు కాకుండా ప్రజా రవాణను ఆశ్రయించడం వల్ల కార్బన ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించవచ్చు అన్నారు.

ప్రిన్సిపాల్ అరుణ మాట్లాడుతూ వృక్షాలను విచక్షణారహితంగా నరికివేస్తున్నందున అడవులు అంతరించిపోతున్నాయని, సరైన వర్షాలు లేక కరువుకాటకాలు సంభవిస్తున్నాయి. దీంతో జల వనరులు నానాటికీ తీసుకట్టుగా మారుతున్నాయి. తత్ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయన్నారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ఉపయోగించాలి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలి అని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన, మరియు వక్తృత్వ పోటీలను నిర్వహించారు. విజేతలకు సర్టిఫికెట్, మెమెంటో మరియు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమం లో సెట్కూరు సిబ్బంది నిదీస్, శ్రీనివాసా సింగ్, కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయ సిబ్బంది మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story