Kurnool: కర్నూలులో ఎల్‌ఆర్‌యస్ మేళా సక్సెస్: పెండింగ్ దరఖాస్తులకు మోక్షం.. మరో రెండు రోజులు పొడిగింపు!

Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎల్‌ఆర్‌యస్ మేళా ఘనంగా సాగుతోంది. 800కు పైగా పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు కమిషనర్ చల్లా ఓబులేసు ఈ మేళాను శని, ఆదివారాలు కూడా పొడిగించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 8 May 2026 7:18 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో ఎల్‌ఆర్‌యస్ మేళా సక్సెస్: పెండింగ్ దరఖాస్తులకు మోక్షం.. మరో రెండు రోజులు పొడిగింపు!

కర్నూలు : నగరంలో సొంతిల్లు కట్టుకోవాలనే ఆశతో, తక్కువ ధరకు లభిస్తోందనే నమ్మకంతో అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయిన ఎంతోమంది ప్రజలకు ఇప్పుడు ఊరట లభిస్తోంది. రియల్టర్ల మాటలు నమ్మి, దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు లేక, బ్యాంకు రుణాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఇప్పుడు ఎల్‌ఆర్‌యస్ మేళాలో క్షణాల్లో క్రమబద్ధీకరణ పత్రాలు పొందుతున్నారు. ఎల్‌ఆర్‌యస్ మేళాపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఎల్‌ఆర్‌యస్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. 800కు పైగా దరఖాస్తులు షార్ట్‌ఫాల్, ఫీ ఇంటిమేషన్ తదితర సమస్యల కారణంగా నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ప్రత్యేక చొరవ తీసుకుని, పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు, సిబ్బంది, ప్లానింగ్ కార్యదర్శులు, ఎల్‌టిపిలతో కలిసి స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఎల్‌ఆర్‌యస్ మేళాకు శ్రీకారం చుట్టారు. తొలుత గురు, శుక్రవారాల్లో నిర్వహించగా, విశేష స్పందన దృష్ట్యా మరో రెండు రోజుల పాటు మేళాను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో శని, ఆదివారాలు సైతం మేళా కొనసాగనుంది.

క్రమబద్ధీకరించుకోని ప్లాట్లపై కఠిన చర్యలు

ఎల్‌ఆర్‌యస్ పథకానికి దరఖాస్తు చేసుకుని ఫీ ఇంటిమేషన్ వచ్చిన వారు, అలాగే షార్ట్‌ఫాల్‌కు సంబంధించిన అవసరమైన పత్రాలు సమర్పించని వెంచర్లపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. కాబట్టి దరఖాస్తుదారులు వెంటనే ఎల్‌ఆర్‌యస్ ప్రక్రియ పూర్తి చేసుకుని ప్రొసీడింగ్స్ పొందాలని కమిషనర్ సూచించారు.

ఎల్‌ఆర్‌యస్ మేళా.. భళా భళా

గత కొన్ని ఏళ్లుగా ఎల్‌ఆర్‌యస్ కోసం ఎదురుచూస్తున్నాం. రాకరాక ఈ పథకం వచ్చింది. దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎల్‌టిపి, అధికారుల మధ్య సమన్వయం లేక ప్రక్రియ పూర్తి కాలేదు. మేళాలో అందరూ ఒకేచోట అందుబాటులో ఉండటంతో అక్కడికక్కడే ప్రొసీడింగ్స్ అందజేశారు.

కే. సత్యనారాయణ, సాయిభగీచ వెంచర్, లక్ష్మిపురం

కమిషనర్‌కు ధన్యవాదాలు

తాను ఎల్‌ఆర్‌యస్ పథకానికి దరఖాస్తు చేసుకుని ఆరు నెలలు దాటిందన్నారు. అధికారులు, ఎల్‌టిపిల మధ్య సమన్వయం లేకపోవడంతో తమకు తెలియకే నెలల తరబడి కాలయాపన జరిగిందన్నారు. ఎల్‌ఆర్‌యస్ మేళా వల్ల ఒక్కరోజులోనే తమ సమస్య పరిష్కారమైందని, కమిషనర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story