Kurnool: గార్గేయపురం డంప్‌యార్డులో బయో మైనింగ్ పనులను వేగవంతం చేయాలి

Kurnool: కర్నూలు నగర శివార్లలోని గార్గేయపురం డంప్‌యార్డులో బయో మైనింగ్, వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు పరిశీలించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 28 Aug 2026 6:03 PM IST
Kurnool
X

Kurnool: గార్గేయపురం డంప్‌యార్డులో బయో మైనింగ్ పనులను వేగవంతం చేయాలి

కర్నూలు: నగర శివార్లలోని గార్గేయపురం డంప్‌యార్డులో బయో మైనింగ్‌ ప్రక్రియ, వేస్ట్‌ టు ఎనర్జీ (డబ్ల్యూఈపీ), ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎస్‌డబ్ల్యూఎం) ప్లాంట్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు సంబంధిత గుత్తేదారులను ఆదేశించారు. శుక్రవారం గార్గేయపురం డంప్‌యార్డులో పనుల పురోగతిని పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు వినాయక ఘాట్‌ వద్ద సీసీ రహదారి, ప్యాచ్‌ వర్క్‌ పనులను పరిశీలించారు. వినాయక నిమజ్జనం నాటికి వినాయక ఘాట్‌ను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దాలని, అవసరమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని కమిషనర్‌ ఆదేశించారు. అనంతరం జోహరాపురం రోడ్డులో ఈ-ఆటోల పార్కింగ్‌, చార్జింగ్‌, గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ పాయింట్ల నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. నగరాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా గార్గేయపురం, జోహరాపురం డంప్‌యార్డుల్లో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సుమారు 10 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను బయో మైనింగ్‌ ద్వారా రిమీడియేషన్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రాసెసింగ్‌ చేసిన వ్యర్థాలు చివరి దశలో ఉన్నందున వాటిని త్వరితగతిన తరలించి, డంప్‌యార్డులో ఖాళీ అవుతున్న ప్రదేశాన్ని తదుపరి వ్యర్థాల నిర్వహణ అవసరాలకు వినియోగించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బయో మైనింగ్‌ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతో పాటు, ప్రాసెసింగ్‌ చేసిన వ్యర్థాలను త్వరగా తరలించాలని ఆదేశించారు.

చెత్త డంపింగ్‌కు శాశ్వత పరిష్కారం చూపుతూ, చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో గార్గేయపురం డంప్‌యార్డులో 15 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో రూ.330 కోట్ల వ్యయంతో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ప్లాంట్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత గుత్తేదారులను ఆదేశించారు.

అదేవిధంగా ఆధునిక వ్యర్థాల నిర్వహణలో భాగంగా 9.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.8 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్‌ ద్వారా ప్రతిరోజూ 200 మెట్రిక్‌ టన్నుల ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెసింగ్‌ చేసి, పునర్వినియోగానికి అనువుగా మార్చేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్లాంట్‌ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో డీఈఈలు పవన్‌ కుమార్‌ రెడ్డి, నరేష్‌, వెహికల్‌ ఇన్‌చార్జి కురుబ మధుబాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు హుస్సేన్‌, శివశంకర్‌, యువరాజు తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story