Kurnool: సుద్దవాగు రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి టీజీ భరత్

Kurnool: కర్నూలు కేసీ కెనాల్ వద్ద రూ.2.50 కోట్లతో సుద్దవాగు రక్షణ గోడ నిర్మాణానికి మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన. త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ రాక.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 July 2026 6:33 PM IST
Kurnool
X

Kurnool: సుద్దవాగు రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి టీజీ భరత్

కర్నూలు: గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి నిధులు సమీకరించి అభివృద్ధి పనులను కార్యాచరణలోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) శాఖ మంత్రి టీ.జీ. భరత్ గుప్తా అన్నారు. బుధవారం నగరంలోని 23, 24 వార్డుల పరిధిలోని కేసీ కెనాల్ సమీపంలో సుద్దవాగు రక్షణ గోడ నిర్మాణానికి నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా కెసి కెనాల్‌లో బీటీఐ (బాసిల్లస్ థురింజియెన్సిస్ ఇజ్రాయెలెన్సిస్) జీవ లార్విసైడ్‌ను పిచికారీ ప్రక్రియను పరిశీలించి, పిచికారిని మరింత ఉదృతంగా చేయాలని కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరంలో వర్షాలు కురిసిన ప్రతిసారి నీటి ప్రవాహం కారణంగా శ్రీరామ్‌నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లోని సుద్దవాగు పరిసరాల్లో వరద పరిస్థితులు ఏర్పడి నీరు ఇళ్లలోకి చేరుతుండేదని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చామని తెలిపారు. అందులో భాగంగా జలవనరుల శాఖ రూ.2.50 కోట్ల వ్యయంతో 250 మీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు.

ఈ నిధుల మంజూరులో జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సహకారం ఎంతో ఉందని, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సహకారంతో మరిన్ని నిధులు సాధించి సుద్దవాగుకు దశలవారీగా పూర్తి స్థాయిలో రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో నగరంలోని దశాబ్దాల నాటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని వెల్లడించారు.

నగరంలో ప్రస్తుతం అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, నాయకత్వమే కారణమని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించాలని సూచించారు. గుజరాత్, సింగపూర్ తరహాలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడంలో విశేష కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి కేబినెట్ సమావేశంలో అంశాలను ప్రస్తావిస్తున్నారని చెప్పారు. త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ వస్తుందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఇటీవల తనకు తెలిపినట్లు వెల్లడించారు.

నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ.. అధిక వర్షాల సమయంలో సుద్దవాగు పరిసర ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు రక్షణ గోడ నిర్మాణం అత్యంత అవసరమని తెలిపారు. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంత్రి టీ.జీ. భరత్ నిధులు మంజూరు చేయించి పనులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. శ్రీరామ్‌నగర్ వద్ద సుద్దవాగు వంతెన నుంచి కేసీ కెనాల్ వరకు 250 మీటర్ల పొడవున జలవనరుల శాఖతో సమన్వయంగా రక్షణ గోడ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్‌ఈ రమణమూర్తి, జలవనరుల శాఖ ఎస్‌ఈ శైలేశ్వర్, ఎంఈ బి. విజయరాజు, నగరపాలక ఎంఈ గిరిరాజ్, డీఈఈ నరేష్, ఏఈ జనార్ధన్, జలవనరుల శాఖ డీఈఈ బి. శ్రీనివాసనాయక్, విజయకుమార్, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, సానిటరీ సూపర్వైజర్ రమేష్, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు హుస్సేన్, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story