Kurnool: ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజా వినతులు స్వీకరించిన జేసీ నూరుల్ ఖమర్
Kurnool: ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
Kurnool: ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజా వినతులు స్వీకరించిన జేసీ నూరుల్ ఖమర్
కర్నూలు: నియోజకవర్గ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఒక్క నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నాల్గవ పర్యటన నిర్వహించారు.
ఈ సందర్భంగా నందవరం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆదోని రెవెన్యూ డివిజనల్ అధికారి అరుణ దేవి, ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలతో పాటు రెవెన్యూ, తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుధ్యం, గృహ వసతి, పింఛన్లు, ఇతర మౌలిక సదుపాయాలు మరియు స్థానిక ప్రజా సమస్యలకు సంబంధించిన అర్జీలను అధికారులకు అందజేశారు.
ప్రజల నుంచి అందిన ప్రతి వినతిపత్రాన్ని పరిశీలించి, సంబంధిత సమస్యల అర్జీలను ఆయా శాఖలకు పంపించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగాల్సిన పరిస్థితి లేకుండా, అందిన వినతులపై బాధ్యతాయుతంగా స్పందించి, నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కామేశ్వర ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ మురళీకృష్ణ, బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన్న, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజా రఘువీర్, జిల్లా రిజిస్టర్ బజారి, తదితరులు పాల్గొన్నారు.




