Devanakonda: దేవనకొండలో ఆగస్టు 10న జైల్‌భరో కార్యక్రమ పిలుపు
Devanakonda: కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న జైల్‌భరో. కర్నూలు జిల్లా దేవనకొండలో కార్మిక సంఘాల సమావేశం.
Devanakonda: దేవనకొండలో ఆగస్టు 10న జైల్‌భరో కార్యక్రమ పిలుపు
దేవనకొండ: దేవనకొండ సమావేశంలో కార్మిక సంఘ నాయకుల పిలుపు..దేవనకొండ: కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల హక్కులను హరిస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న నిర్వహించే జైల్‌భరో, నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి. వీరశేఖర్, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి ఎం. నరసరావు పిలుపునిచ్చారు.
శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కార్మిక సంఘాల సమావేశం సిఐటియు మండల కార్యదర్శి ఎమ్.అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... కార్మికులు చెమటోడ్చి సంపద సృష్టిస్తున్నా వారి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదన్నారు. రూ.31 వేల కనీస వేతనం అమలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పర్మినెంట్ పనుల్లో కొనసాగుతున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని విమర్శించారు. అన్ని పంటలకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధర ప్రకటించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతుల రుణాలు మాఫీ చేసి, ఉచిత పంటల బీమా అమలు చేయాలని కోరారు.
ఉపాధి హామీని నిర్వీర్యం చేసే చర్యలను ఆపాలన్నారు. 200 రోజుల పని, రోజుకు రూ.700 వేతనం ఇవ్వాలన్నారు. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించే ప్రైవేటీకరణ విధానాలకు స్వస్తి పలకాలని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యుడి జీవితం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలను కుల, మతాల పేరుతో విడదీసే రాజకీయాలను తిప్పికొట్టి, కార్మికులు–రైతులు–ప్రజలు ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతుల రూ.2 లక్షల వరకు బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని, వేదవతి, గుండ్రేవుల రిజర్వాయర్లను పూర్తి చేయాలని, హంద్రీ–నీవా ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు కాలువలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులపై దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆగస్టు 10న నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే జైల్‌భరో, నిరసన కార్యక్రమాలకు వేలాదిగా తరలివచ్చి కేంద్ర ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక,రైతు, వ్యవసాయ, కార్మిక, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు యూసుఫ్ భాష,కృష్ణ, వై.మహేంద్ర,రామంజి, భాస్కర్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.




