Kurnool: కర్నూలులో అనుమతి లేని ఫ్లెక్సీలపై నిషేధం.. కమిషనర్ హెచ్చరిక!
Kurnool: కర్నూలు నగరంలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే మున్సిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్చరించారు.
Kurnool: కర్నూలులో అనుమతి లేని ఫ్లెక్సీలపై నిషేధం.. కమిషనర్ హెచ్చరిక!
Kurnool: నగరంలోని కూడళ్లు, ప్రధాన రహదారులు, భవనాలపై అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మున్సిపల్ చట్టం ప్రకారం ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. అనధికారంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల ప్రమాదాలు సంభవించినట్లయితే సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విపరీతమైన గాలులు వీచిన సమయంలో ఫ్లెక్సీలు వాహనాలపై పడే అవకాశం ఉండటంతో పాటు, వాటిని చూస్తూ వాహనదారులు ముందున్న పరిస్థితులను గమనించక ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
అదేవిధంగా నగర సుందరీకరణ కోసం నగరపాలక సంస్థ లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతోందని, కూడళ్లు, డివైడర్లు, గోడలపై పోస్టర్లు అతికించడం, ఫ్లెక్సీలు కట్టడం ద్వారా నగర అందాన్ని పాడు చేస్తే భారీ జరిమానాలు విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. కావున ప్రజలు, రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రైవేటు సంస్థలు మున్సిపల్ నిబంధనలు పాటించి నగర పరిశుభ్రత, సుందరీకరణ పరిరక్షణకు సహకరించాలని కమిషనర్ కోరారు.




