Kurnool: పారిశుద్ధ్య నిర్వహణలో మార్పులు - చెత్త బదిలీ కేంద్రాలు

Kurnool: కర్నూలు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుదలకు జీటీఎస్ తరహాలో రెండు చెత్త బదిలీ కేంద్రాలను కమిషనర్ చల్లా ఓబులేసు ప్రారంభించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 10 Sept 2026 4:29 PM IST
Kurnool
X

Kurnool: పారిశుద్ధ్య నిర్వహణలో మార్పులు - చెత్త బదిలీ కేంద్రాలు

కర్నూలు: కర్నూలు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచి, 100 శాతం ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించేందుకు మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.

ఇంటింటి చెత్త సేకరణ వాహనాలు చెత్తను తరలించేందుకు ప్రతిసారీ గార్గేయపురం డంప్‌యార్డుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జీటీఎస్ తరహాలో రెండు చెత్త బదిలీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గురువారం విశాల్ మార్ట్ వెనుక ఈ-ఆటోల చార్జింగ్ కేంద్రం వద్ద, జొహరాపురం రోడ్డులోని జీటీఎస్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలను కమిషనర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఇంటింటి చెత్త సేకరణ వాహనాలు సేకరించిన చెత్తను తరలించేందుకు గార్గేయపురం డంప్‌యార్డుకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. దీంతో వాహనాలు డంప్‌యార్డుకు వెళ్లి తిరిగి రావడానికి ఎక్కువ సమయం పట్టడంతో పాటు, ఆ సమయాన్ని ఇంటింటి చెత్త సేకరణకు పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం లేకపోయేదన్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా జీటీఎస్ తరహాలో రెండు చెత్త బదిలీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెంకటరమణ కాలనీలోని విశాల్ మార్ట్ వెనుక ఈ-ఆటోల చార్జింగ్ కేంద్రం వద్ద ఒకటి, జొహరాపురం రోడ్డులోని జీటీఎస్ వద్ద మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కేంద్రాల్లో చెత్తను సులభంగా పెద్ద కంపాక్టర్ వాహనాల్లోకి బదిలీ చేసేందుకు ప్రత్యేక ర్యాంపులను నిర్మించినట్లు చెప్పారు. మొత్తం 3 కంపాక్టర్లు ఇక్కడ చెత్త తరలింపు చేస్తుంటాయన్నారు.

ఇకపై ఇంటింటి చెత్త సేకరణ వాహనాలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో చెత్తను సేకరించిన అనంతరం సమీపంలోని బదిలీ కేంద్రానికి చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద కంపాక్టర్ వాహనాల్లోకి చెత్తను బదిలీ చేస్తాయని కమిషనర్ తెలిపారు. అనంతరం కంపాక్టర్ వాహనాలు చెత్తను నేరుగా గార్గేయపురం డంప్‌యార్డుకు తరలిస్తాయని చెప్పారు.

ఈ విధానం ద్వారా చెత్త సేకరణ వాహనాలు గార్గేయపురం డంప్‌యార్డుకు వెళ్లి తిరిగి రావడానికి పట్టే సమయం తగ్గుతుందని కమిషనర్ పేర్కొన్నారు. ఆదా అయ్యే సమయాన్ని పూర్తిగా ఇంటింటి చెత్త సేకరణకు వినియోగించుకోవడం ద్వారా వాహనాలు ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉండి మరిన్ని ఇళ్ల నుంచి చెత్తను సేకరించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. తద్వారా 100 శాతం ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యాన్ని మరింత సమర్థవంతంగా సాధించేందుకు ఈ విధానం దోహదపడుతుందని చెప్పారు.

అంతకుముందు వినాయక ఘాట్‌ను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. నగర ప్రజలు ఇళ్లలో ప్రతిష్ఠించే చిన్న మట్టి విగ్రహాల నిమజ్జనానికి ఘాట్ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన సమయానికి వర్షాలు కురిస్తే, వర్షపు నీరు నిల్వ ఉండేలా నిర్మిస్తున్న అడ్డుకట్టను పరిశీలించారు. అడ్డుకట్ట నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశిస్తూ, వర్షాలు కురిసి తగినంత నీరు అందుబాటులోకి వస్తే చిన్న విగ్రహాల నిమజ్జనానికి వినాయక ఘాట్‌ను వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్లలో ఉత్పత్తయ్యే చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నగరపాలక సంస్థ చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందించాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణలో నగరపాలక సంస్థ చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించి పరిశుభ్రమైన కర్నూలు సాధనకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, ఎంఈ గిరిరాజ్, డీఈఈలు నరేష్, పవన్ కుమార్ రెడ్డి, శానిటరీ సూపర్‌వైజర్ రమేష్ బాబు, ఇన్‌స్పెక్టర్లు హుస్సేన్, జిలానీ, ఫరూక్, శివశంకర్, మునిస్వామి, వెహికల్ ఇంచార్జీ కురుబ మధుబాబు, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story