Kurnool: కర్నూలులో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసిన కమిషనర్
Kurnool: కర్నూలు నగరంలో పారిశుద్ధ్య పనులను కమిషనర్ చల్లా ఓబులేసు పరిశీలించారు. త్వరలో 91 ఈ-ఆటోలు అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు.
Kurnool: కర్నూలులో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసిన కమిషనర్
కర్నూలు: నగరంలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావడానికి నగరపాలక సంస్థ అనేక చర్యలు చేపడుతోందని కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. గురువారం ఆయన కిడ్స్ వరల్డ్ కూడలి, బుధవారపేట కూడలి, వినాయక ఘాట్, ఓమెగా ఆసుపత్రి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అలాగే విజయపురి కాలనీ, శివప్రియ నగర్ ప్రాంతాల్లో పిజిఆర్‌ఎస్ ఫిర్యాదులను పరిశీలించారు.
పరిమళ నగర్ అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు. 5 రహదారుల కూడలి, రైల్వే స్టేషన్ సమీపంలో లేబర్ అడ్డా ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. వెంకటరమణ కాలనీలోని విశాల్ మార్ట్ వెనుక ఈ-ఆటోల పార్కింగ్, చార్జింగ్, గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లను పరిశీలించారు. అనంతరం కేసీ కెనాల్‌లో యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న గుర్రపుడెక్క మొక్కల తొలగింపు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా త్వరలో 91 చెత్త సేకరణ ఈ-ఆటోలు అందుబాటులోకి రానున్నాయని, వీటి ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తొలి దశలో 42 ఈ-ఆటోలు నగరానికి చేరుకున్నాయని, మిగిలిన వాహనాలు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ-ఆటోల కోసం విశాల్ మార్ట్ వెనుక పార్కింగ్, చార్జింగ్, గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నగరంలో చెత్త సేకరణ, తరలింపు, పారిశుద్ధ్య నిర్వహణలో ఆధునిక విధానాలను అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కమిషనర్ తెలిపారు. వీధులు, ప్రధాన రహదారులు, కాలనీలు, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు చెప్పారు. నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
నగరంలో దోమల నివారణకు నగరపాలక సంస్థ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి వాటిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు అధికారులు, కార్మికులు ఎంతగానో శ్రమిస్తున్నారని కొనియాడారు.
కొన్ని రోజుల క్రితం డ్రోన్ ద్వారా బీటీఐ బయో లార్విసైడ్ పిచికారీ చేసినప్పటికీ, దోమల ఉత్పత్తిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు స్వయంగా కేనాల్‌లోకి దిగి పిచికారీ చేశారని తెలిపారు. తేమ, అపరిశుభ్ర వాతావరణం మధ్య పనిచేస్తూ కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పారు. కాళ్ల వరకు తేమలో పనిచేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దురద, ఎర్రటి దద్దుర్లు, మంట వంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, దోమల నియంత్రణ కోసం వారు విధులు నిర్వహించారని తెలిపారు.
అంతేకాకుండా కేనాల్‌లో పనిచేసే సమయంలో పాములు, తేళ్లు, జర్రులు, ఎలుకల ముప్పుతో పాటు విపరీతమైన దోమల మధ్య కార్మికులు శ్రమించారని కమిషనర్ పేర్కొన్నారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి అభినందించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం కేసీ కెనాల్‌లో పేరుకుపోయిన గుర్రపుడెక్కను పూర్తిస్థాయిలో తొలగించేందుకు హిటాచీలు, ట్రాక్టర్లు, టిప్పర్లను వినియోగిస్తూ యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఒక్కోరోజు సుమారు 70 నుంచి 100 ట్రిప్పుల వరకు గుర్రపుడెక్కను తొలగించి తరలిస్తున్నామని చెప్పారు. కేనాల్ పరిశుభ్రతతో పాటు దోమల ఉత్పత్తి కేంద్రాలను నిర్మూలించడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
దోమల నియంత్రణ అనేది కేవలం నగరపాలక సంస్థ బాధ్యత మాత్రమే కాదని, నగర ప్రజలందరి సమిష్టి బాధ్యత అని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు.
ప్రజల భాగస్వామ్యంతోనే కర్నూలు నగరాన్ని దోమల రహితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దగలమని ఆయన పేర్కొన్నారు. నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, చెత్తను వేరు చేసి అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా సహకరించాలని కమిషనర్ కోరారు.
కార్యక్రమంలో ఎస్‌ఈ రమణమూర్తి, డీఈఈలు పవన్ కుమార్ రెడ్డి, నరేష్, ఏఈలు వైష్ణవి సీవీఆర్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఖాసీం వలి, రాజశేఖర్, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు హుస్సేన్, మునిస్వామి, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ దివాకర్ నాయుడు, ట్యాబ్ ఇన్‌స్పెక్టర్ రవి, వెహికల్ ఇంచార్జీ కురుబ మధు, తదితరులు పాల్గొన్నారు.




