Kurnool: కర్నూలులో CAT, CET పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్ ఆదేశాలు
Kurnool: కర్నూలులో ఏప్రిల్ 24న CAT, CET పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
Kurnool
Kurnool: కర్నూలు జిల్లాలో ఏప్రిల్ 24న నిర్వహించనున్న CAT, CET ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో, ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయముల సంస్థ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. 5వ నుండి 8వ తరగతుల వరకు CAT పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 27 కేంద్రాల్లో నిర్వహించబడనుందని, ఈ పరీక్షకు 6310 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.
అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశానికి CET పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 35 కేంద్రాల్లో జరుగుతుందని, 7613 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాసే విద్యార్థుల్లో సుమారు 15 శాతం మంది కర్నూలు జిల్లాకు చెందిన వారేనని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద శాంతిభద్రతల కోసం తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి కేంద్రంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు, అంబులెన్స్ సదుపాయం సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు.
అభ్యర్థుల సౌకర్యార్థం బస్సు సర్వీసులను నిరంతరం నడపాలని ఆర్టీసీ అధికారులకు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు చేయాలని, సమీపంలోని ఇంటర్నెట్, జిరాక్స్ కేంద్రాలను ఆ రోజు మూసివేయాలని తహశీల్దార్‌కు సూచించారు.
పరీక్షా కేంద్రాల్లో పరిశుభ్రత, తాగునీరు, సరైన ఫర్నిచర్, గాలి-వెలుతురు సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇన్విజిలేటర్లు మొబైల్ ఫోన్లు ఉపయోగించరాదని కూడా ఆదేశించారు.
ఈ సమావేశంలో ఇంచార్జి డిఆర్ఓ చిరంజీవి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవింద, కన్వీనర్ ప్రిన్సిపాల్ పుష్పరాజ్, చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.




