Kurnool: కర్నూలు కలెక్టర్ సీరియస్ సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లకు హెచ్చరిక!

Kurnool: సంక్షేమ వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, భోజన నాణ్యతపై రాజీపడొద్దని కలెక్టర్ డా. ఏ. సిరి హెచ్చరించారు. వార్డెన్లు, సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 4 Sept 2026 11:22 AM IST
Kurnool
X

Kurnool: కర్నూలు కలెక్టర్ సీరియస్ సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లకు హెచ్చరిక!

Kurnool: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అన్ని సంక్షేమ విభాగాల ప్రిన్సిపాల్స్/వార్డెన్‌లను హెచ్చరించారు.

గురువారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో సంక్షేమ శాఖలకు సంబంధించిన పురోగతి పై అన్ని సంక్షేమ విభాగాల ప్రిన్సిపాల్స్/వార్డెన్‌లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాలను తరచుగా తనిఖీ చేస్తానని, తనిఖీల సమయంలో లోపాలు కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు..

వసతి గృహాల వార్డెన్లు, కుక్‌లు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రతి నెలా సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. వసతి గృహాలలో టాయిలెట్లు, గదులు మరియు హాస్టల్ ప్రాంగణం శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యార్థులకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత వార్డెన్లు, సిబ్బందిపై ఉందన్నారు..విద్యార్థులు తమ తల్లిదండ్రులను విడిచి ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్నందున, వారికి తల్లిదండ్రుల లాగా సంరక్షణ, ఆప్యాయత అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు.

ఎమ్ఈఓ లు, ఎంపిడిఓ లు, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు తమ పరిధిలోని పాఠశాలలు, హాస్టళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలన్నారు.

ఈ విద్యా సంవత్సరంలో గతంతో పోలిస్తే పాస్‌ శాతాన్ని కనీసం 15 శాతానికి మించి పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లలో తాగునీటి నాణ్యతపై నిరంతరం పరీక్షలు నిర్వహించాలన్నారు.

వసతి గృహాల్లో అవసరమైన మరమ్మతులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. మంజూరు చేసిన నిధులు సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు, పనులు నాణ్యతతో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.. అన్నం సక్రమంగా ఉడికించడంతో పాటు సరిపడా పరిమాణంలో భోజనం అందుచేయాలన్నారు. భోజనానికి సంబంధించిన బిల్లులు, ఖర్చులు, విద్యార్థులకు అందిస్తున్న భోజన పరిమాణం, నాణ్యతను సరిపోల్చి పరిశీలిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

నాసిరకం భోజనం అందిస్తూ బిల్లులు పొందుతున్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. వార్డెన్లు, సంబంధిత సిబ్బంది తమకు కేటాయించిన హెడ్‌క్వార్టర్స్‌లో నివాసం ఉండేలా చూడాలని కలెక్టర్ వార్డెన్ లను ఆదేశించారు..

హాస్టళ్లలో సోక్‌పిట్లు, రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణాలు, ప్లాంటేషన్‌ పనులలో పురోగతి తీసుకొని రావాలన్నారు.. పెండింగ్‌ పనులన్నింటినీ సెప్టెంబర్‌ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వార్డెన్ లను ఆదేశించారు.. సమావేశంలో డ్వామా పిడి నరసింహ రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి ప్రసూన, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేష్, వార్డెన్ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story