Kurnool: నిర్దేశిత లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలి

Kurnool: కర్నూలు కలెక్టరేట్‌లో డిసీసీ సమావేశం నిర్వహించిన కలెక్టర్ డా.ఏ.సిరి, బ్యాంకర్లు గృహనిర్మాణం, విద్యా, ఎంఎస్‌ఎంఈ రుణాల లక్ష్యాలు సాధించాలని ఆదేశించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 Aug 2026 4:52 PM IST
Kurnool
X

Kurnool: నిర్దేశిత లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలి

కర్నూలు: బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని, గృహనిర్మాణం, విద్యా రుణాలు, ఎంఎస్ఎంఈ, వ్యవసాయ మౌలిక వసతులు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో రుణాల లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి బ్యాంకు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో బ్యాంకర్లకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (DCC) సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా రుణాల విషయంలో బ్యాంకులు మరింత చొరవ చూపాలన్నారు. అర్హులైన విద్యార్థులకు సకాలంలో రుణాలు అందించాలని కలెక్టర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ రంగంలో సాధన కేవలం 12.45 శాతం మాత్రమే ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పెండింగ్‌లో ఉన్న రుణ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి లక్ష్యాలను మెరుగుపరచాలన్నారు.

వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన రంగంలో కూడా రుణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని కలెక్టర్ పేర్కొంటూ, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రుణాల మంజూరును వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో లోన్లకు సంబంధించి అధిక లక్ష్యాలు ఉన్నప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 49 శాతం లక్ష్యాలను సాధించారని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులు లక్ష్య సాధనలో మరింత చొరవ చూపి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో వచ్చే త్రైమాసికంలో మెరుగైన పురోగతి సాధించాలన్నారు..

జిల్లా ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలో ఎంఎస్ఎంఈ రంగం కీలక పాత్ర పోషిస్తుందని, అందువల్ల జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రుణాల పంపిణీలో బ్యాంకులు మరింత చురుకుగా వ్యవహరించి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎంఎస్ఎంఈ రుణాల లక్ష్య సాధనలో మెరుగైన పనితీరు కనబరుస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇతర బ్యాంకులు కూడా ఎస్‌బీఐ అనుసరిస్తున్న విధానాలు, కార్యాచరణ ప్రణాళికలను అధ్యయనం చేసి లక్ష్య సాధనకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంఎస్ఎంఈ రుణాల లక్ష్య సాధనలో కేవలం 11 శాతం ప్రగతిలో ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్ చివరి నాటికి కనీసం 50 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. రైతులు గత కొంతకాలంగా సాగునీటి సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి పశుపోషణ మంచి ప్రత్యామ్నాయ జీవనోపాధిగా ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులు, లబ్ధిదారులకు పశుపోషణ యూనిట్ల కోసం ఎక్కువ సంఖ్యలో రుణాలు మంజూరు చేసి రైతులకు అండగా నిలవాలన్నారు.. పశుసంవర్ధక యూనిట్లకు బీమా ఎంతో ముఖ్యమని, ప్రతి యూనిట్‌కు బీమా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో పీఎం విశ్వకర్మ కార్యక్రమం కింద పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్ధిదారుల రుణ దరఖాస్తులను సెప్టెంబర్ నెలాఖరులోగా పరిష్కరించి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. ముద్ర రుణాల కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు.. PMFME పథకం కింద రుణ దరఖాస్తుల తిరస్కరణలు అధికంగా ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరస్కరించబడిన దరఖాస్తులను ప్రత్యేకంగా పునఃపరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరయ్యేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు.

రుణ దరఖాస్తులు ఎందుకు తిరస్కరణకు గురవుతున్నాయనే మూల కారణాలను అధికారులు, బ్యాంకర్లు గుర్తించి, వాటి పరిష్కారానికి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్నప్పుడే లక్ష్యాలను సమర్థవంతంగా సాధించగలమని కలెక్టర్ స్పష్టం చేశారు.. అన్ని సందర్భాల్లో కేవలం నిబంధనలకే పరిమితం కాకుండా, అర్హులైన పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు.

పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటును ప్రోత్సహించి, అర్హులైన లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పథకం అమలును వేగవంతం చేసేందుకు బ్యాంకులతో సమన్వయం చేసి, లబ్ధిదారులకు రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..

సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రవీంద్రబాబు, కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి.మోహన్, నాబార్డ్ డిడియం ఎం.సుబ్బారెడ్డి, కెనరా బ్యాంకు రీజినల్ మేనేజర్ సుశాంత్ కుమార్, కెనరా బ్యాంక్ ఆర్సిటి డైరెక్టర్ పుష్ప కుమార్, కేడిసిసి బ్యాంక్ సీఈఓ రామాంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, కర్నూలు అదనపు మున్సిపల్ కమిషనర్ కృష్ణ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని సబిహ పర్వీన్, పరిశ్రమల శాఖ అధికారి సంజీవ రాజు , డిఆర్డిఏ పిడి శ్రీధర్, మెప్మా పిడి శ్రీనివాసులు, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story