Kurnool: రాష్ట్రస్థాయి పోటీల్లో కర్నూలు క్రీడాకారుల ప్రతిభ!
Kurnool: తిరుపతి అమరావతి ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన కర్నూలు క్రీడాకారులను సునయన ఆడిటోరియంలో అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి.
Kurnool: రాష్ట్రస్థాయి పోటీల్లో కర్నూలు క్రీడాకారుల ప్రతిభ!
Kurnool: ఆగస్టు 24 నుండి 26వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీల్లో కర్నూలు జిల్లాకు చెందిన క్రీడాకారులు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమంలో పాల్గొని, వివిధ విభాగంలో మెడల్ సాధించిన క్రీడాకారులను అభినందించారు.
ఈ సందర్భంగా..అథ్లెటిక్స్ విభాగంలో, 800 మీటర్ల పరుగులో అండర్-23 విభాగానికి చెందిన రామాంజనేయులు స్వర్ణ పతకం సాధించారు. అండర్-17 విభాగంలో మనీష్ అశ్విని కుమార్ నాయుడు రజత పతకం కైవసం చేసుకున్నారు. 100 మీటర్ల పరుగులో అండర్-23 విభాగానికి చెందిన కె. మంజు కాంస్య పతకం సాధించగా, హైజంప్ విభాగంలో కూడా కాంస్య పతకం సాధించారు.
వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో, 60 కిలోల విభాగంలో డి.జి. వీరేష్ స్వర్ణ పతకం, 65 కిలోల విభాగంలో బి. వీరేష్ స్వర్ణ పతకం సాధించారు. +110 కిలోల విభాగంలో పర్వేజ్ ముషారఫ్ రజత పతకం కైవసం 75 కేజీల విభాగంలో అబ్దుల్ హక్ బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. అండర్-17 బాలుర విభాగంలో 95 కిలోల కేటగిరీలో షేక్ అఫ్రుద్ స్వర్ణ పతకం, 70 కిలోల విభాగంలో షేక్ సాద్ రజత పతకం, 75 కిలోల విభాగంలో షేక్ జైద భాషా రజత పతకం సాధించారు.
65 కిలోల విభాగంలో వి. సాయి నితేష్ మూడో స్థానం సాధించి కాంస్య పతకం పొందారు. యోగ విభాగంలో ధన ధీరజ్ రజత పతకం సాధించి జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... క్రీడాకారులు క్రమశిక్షణ, కఠోర శ్రమతో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో కర్నూలు జిల్లా కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) భూపతిరావు, వెయిట్‌లిఫ్టింగ్ కోచ్ యూసఫ్ భాష, అథ్లెటిక్స్ కోచ్ కాశిరావు తదితరులు పాల్గొన్నారు.




