Kurnool: భూ వివాదాలకు రీ-సర్వేతో శాశ్వత పరిష్కారం
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో భూ రీ-సర్వేను తనిఖీ చేసిన ఇంచార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్.
Kurnool: భూ వివాదాలకు రీ-సర్వేతో శాశ్వత పరిష్కారం
Kurnool: జిల్లాలో 5వ దశలో నిర్వహిస్తున్న రీ సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, సర్వే నిర్వహణకు ముందు రైతులకు ముందస్తు నోటీసులు అందజేయాలని ఇంచార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. బుదవారం కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో 5వ దశలో నిర్వహిస్తున్న రీ సర్వే ప్రక్రియను ఇంచార్జి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమాన్ని ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో సందర్శించి భూమి సరిహద్దుల నిర్ధారణ, భూ సంబంధిత రికార్డుల పరిశీలన, రోవర్ యంత్రం పని తీరు తదితర అంశాలను ఇంచార్జి కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రీ-సర్వే బృందాలు నిర్వహిస్తున్న కొలతల విధానం, సాంకేతిక పరికరాల వినియోగం,
భూ వివరాల నమోదు ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రైతుల భూముల హద్దులు ఖచ్చితంగా నమోదు కావాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రైతులతో నేరుగా మాట్లాడిన ఇంచార్జి కలెక్టర్...రీ-సర్వే ప్రక్రియకు సంబంధించిన నోటీసులు మీకు అందాయా?, భూ సర్వే తేదీలు మరియు వివరాలు ముందుగానే తెలియజేస్తున్నారా?, అధికారులు మీ సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారా? వంటి అంశాలపై ఆరా తీశారు.
రైతులకు పూర్తి సమాచారం అందేలా చూడాలని, ప్రతి దశలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. రీ-సర్వే ప్రక్రియ వల్ల భూ వివాదాలు తగ్గి రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. భూముల సరిహద్దులు శాస్త్రీయ పద్ధతిలో నమోదు కావడం ద్వారా భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.
ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూ రికార్డులను నవీకరిస్తోందని తెలిపారు. కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామ పరిధిలో మొత్తం 7,157 ఎకరాల భూమి ఉండగా, సుమారు 2,300 మంది రైతులు ఉన్నారని అధికారులు ఇంచార్జి కలెక్టర్‌కు వివరించారు. గ్రామంలో రీ-సర్వే ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ సూచించారు.
రీ-సర్వే ప్రక్రియకు సంబంధించిన రైతుల ఈ-కేవైసీ నమోదు కార్యక్రమాన్ని ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించి, ప్రతి అర్హత రైతు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని ఇంచార్జి కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగరాజు, సర్వే సిబ్బంది, గ్రామస్థులు, రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




