Nandyal: పెట్రోల్ బంకుల దందా.. పవర్ ముసుగులో భారీ వసూళ్లు!
Nandyal: ఆత్మకూరు డివిజన్‌లో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత. పవర్ పెట్రోల్ పేరుతో అదనపు వసూళ్లు.
Nandyal: పెట్రోల్ బంకుల దందా.. పవర్ ముసుగులో భారీ వసూళ్లు!
Nandyal: ఆత్మకూరు పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించిన పెట్రోల్ బంకు వ్యాపారులు కొత్త మోసాలకు తెర లేపారు. పవర్, హై స్పీడ్ పెట్రోలు ముసుగులో సాధారణ పెట్రోల్ ను వినియోగదారులకు అంటగట్టి భారీ దందాకు పాల్పడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నించేవారు లేకపోవడంతో లీటర్ పై అదనంగా రూ. 10 లను ముక్కు పిండి వసూలు చేస్తున్న దందా నల్లమల ఆత్మకూరు డివిజన్లో యదేచ్ఛగా సాగుతుంది. ఇదిలా ఉంటే.. డివిజన్లోని 40 కి పైగా ఫిల్లింగ్ అవుట్ లెట్ స్టేషన్లో డీజిల్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. ఒకవైపు చమురు నిల్వల కొరత లేదంటున్న జిల్లా అధికారులు ఆత్మకూరు డివిజన్లో కనిపిస్తున్న చమరుకొరత వాస్తవమా? .. లేక అవుట్ లెట్ నిర్వాహకులు సృష్టిస్తున్న కొరతనా? అంటూ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
దేశంలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలను కేంద్రం పెంచవచ్చనే ప్రచారంతో ఇంధన నిలువలు లేవని యజమానులు బంకులకు తాళాలు వేస్తున్నారని రైతులు ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే .. దళారులు సంధ్యట్లో సడే మియా అన్నట్లు.. ఫిల్లింగ్ స్టేషన్ల యజమానులతో కుమ్మక్కై రాత్రికి రాత్రి పెద్ద పెద్ద క్యాన్లలో డీజిల్, పెట్రోల్ నింపుకొని నల్లమల గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఒక లీటర్ పై రూ. 150 - 200 వరకు విక్రయించి దండుకుంటున్నారు. ఇలాంటి అక్రమాలను నియంత్రించాల్సిన పౌర సరఫరాల, విజిలెన్స్ అధికారులు విఫలమయ్యారని పౌర సమాజం విమర్శిస్తుంది. రైతు వ్యవసాయ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షారన్ ఆదేశించినా ఆదిశగా ఆత్మకూరు డివిజన్లో కిందిస్థాయి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.




