Kurnool: డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ జీవిత చరిత్ర గ్రంథావిష్కరణ

Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ జీవిత చరిత్ర గ్రంథాన్ని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆవిష్కరించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 17 July 2026 12:44 PM IST
Kurnool
X

Kurnool: డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ జీవిత చరిత్ర గ్రంథావిష్కరణ

Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ గారి విద్యా సేవలు, సమాజ సేవ, కళాశాల అభివృద్ధికి చేసిన విశిష్ట కృషిని గుర్తిస్తూ వారి జీవిత చరిత్రను ఆవిష్కరించే "డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ – జీవిత ప్రస్థానం" అనే జీవిత చరిత్ర గ్రంథాన్ని విడుదల చేయడం విశేషంగా జరిగింది.

ఈ గ్రంథాన్ని కర్నూలు ప్రాంతీయ సంయుక్త విద్యా సంచాలకులు (RJD) మరియు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ జీవిత చరిత్ర గ్రంథంలో డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ గారి బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితం, బాధ్యతలు, సాధించిన విజయాలు, అందుకున్న అవార్డులు, సమాజ సేవ, విద్యా రంగంలో చేసిన విశేష కృషి వంటి అంశాలను సమగ్రంగా పొందుపరిచారు.

నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలం, వెలుగోడు గ్రామం నుండి వచ్చిన డాక్టర్ నాగస్వామి నాయక్ గారు చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పట్టుదలతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి ప్రభుత్వ విద్యాశాఖలో ప్రిన్సిపాల్‌గా సేవలందిస్తున్నారు. వారి జీవిత ప్రయాణం నేటి యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.

విద్యార్థుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ, ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో కళాశాల ఉత్తీర్ణత శాతాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు విశేష కృషి చేశారు. విద్యార్థుల విద్యతో పాటు వారి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రక్త పరీక్షలు, కంటి పరీక్షలు, అవసరమైన వారికి ఉచిత కళ్లద్దాల పంపిణీ, వైద్య శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలను చేపట్టారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కళాశాల ప్రాంగణంలో విస్తృతంగా మొక్కలు నాటించడం, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడం, పోలియో చుక్కల కార్యక్రమాల్లో విద్యార్థులతో కలిసి ప్రత్యక్షంగా పాల్గొని సేవలందించడం, సామాజిక బాధ్యతలను విద్యార్థులకు అలవాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళాలను నిర్వహించి, వివిధ సంస్థలను కళాశాలకు ఆహ్వానించి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేశారు. కళాశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యా నాణ్యత పెంపు, విద్యార్థుల సమగ్ర వికాసం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు.

డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ గారి సేవలకు గుర్తింపుగా 100కు పైగా జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించాయి. అంతేకాకుండా వారి విశిష్ట సేవలకు గుర్తింపుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం వారి జీవితంలో ఒక అపూర్వమైన మైలురాయిగా నిలిచింది.

ఈ జీవిత చరిత్ర గ్రంథం డాక్టర్ నాగస్వామి నాయక్ గారి సేవలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు, యువతకు స్ఫూర్తినిచ్చే ఒక విలువైన గ్రంథంగా నిలుస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు. విద్య, సేవ, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే సాధారణ గ్రామీణ నేపథ్యం నుండి కూడా అత్యున్నత శిఖరాలను చేరుకోవచ్చని వారి జీవిత ప్రస్థానం నిరూపిస్తుందని కొనియాడారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story