Kurnool: కర్నూలులో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ కీలక సదస్సు!
Kurnool: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్‌లో ప్రజాభిప్రాయ సేకరణ, సమీక్షా సమావేశం నిర్వహించారు.
Kurnool: కర్నూలులో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ కీలక సదస్సు!
కర్నూలు: రాజ్యాంగ నిబంధనలు, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనా వేయడం కోసం డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ల అంశం పై కుల సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు మరియు ప్రజల నుండి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడం కోసం జిల్లాల పర్యటన చేపట్టామన్నారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న జనాభా గణాంకాలు, గత ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం, ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నామని చైర్మన్ తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు నిర్ణయించే ప్రక్రియలో ఖచ్చితమైన జనాభా అంచనా అత్యంత కీలకమని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు.
బీసీల జనాభా అంచనాకు కమిషన్ రెండు ప్రధాన అంశాలను పరిశీలిస్తోందన్నారు. ఒకటి బీసీల సామాజిక వెనుకబాటు, రెండవది వారి జనాభా శాతం అని చైర్మన్ వివరించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వంటి ప్రతి ఎన్నికల యూనిట్‌లో ఎంత శాతం స్థానాలు బీసీలకు రిజర్వ్ చేయాలనే విషయంపై కమిషన్ సిఫారసులు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ ప్రక్రియలో ప్రస్తుతం జరుగుతున్న సర్వేల నాణ్యత, ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమన్నారు. ఇంతకుముందు నిర్వహించిన కుల గణనతో పాటు ప్రస్తుతం జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా వివరాలను పరిశీలిస్తున్నామన్నారు. సర్వే పూర్తి శాతంపై కాకుండా, అందులోని డేటా ఖచ్చితత్వం మరియు నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 99 శాతం సర్వే పూర్తయింది అనేది మాత్రమే ముఖ్యం కాదని, 99 శాతం ఖచ్చితత్వం కూడా ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే ఆ డేటాను కమిషన్ విశ్వసనీయంగా ఉపయోగించుకోగలదని చైర్మన్ పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమయానికి నిర్వహించడం రాష్ట్రానికి అత్యంత కీలకం అన్నారు. 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ల విడుదలకు ఎన్నికలు తప్పనిసరి అన్నారు. బీసీ జనాభా, రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ సమగ్ర పరిశీలన చేస్తోందన్నారు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బీసీల జనాభా, రిజర్వేషన్ శాతాలపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత మాత్రమే ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్లగలదన్నారు.
ప్రతి యూనిట్‌కు సంబంధించిన బీసీ జనాభా శాతం, రిజర్వేషన్ పరిమితులపై కమిషన్ సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. సర్వే ద్వారా వచ్చిన డేటాను కమిషన్ గణాంకపరంగా విశ్లేషించాల్సి ఉంటుందని, దాని ఖచ్చితత్వం, స్థిరత్వం, విశ్వసనీయతను క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుందని చైర్మన్ పేర్కొన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అమలులో ఉన్న రిజర్వేషన్ శాతాలు, కులాల వారీ వివరాలను కూడా పరిశీలిస్తున్నామని చైర్మన్ తెలిపారు. జిల్లాల నుంచి అందిన వివరాలు పద్ధతిగా, సమగ్రంగా అందుతున్నాయని, జిల్లా యంత్రాంగం సమర్థంగా పని చేస్తోందని చైర్మన్ అభినందించారు.
ప్రజల అభిప్రాయాలను పారదర్శకంగా పరిశీలిస్తున్నామని కమిషన్ ప్రతినిధి తెలిపారు. జనాభా వివరాలు, ఓటర్ల సంఖ్య, బీసీ ఓటర్ల నిష్పత్తి వంటి అంశాలను పరిశీలిస్తూ సంబంధిత వివరాలను క్రాస్ చెక్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ పేర్కొన్నారు. కుల సంఘాల ప్రతినిధులు వ్యక్తం చేస్తున్న సమస్యలను ఓపికగా విని, వాటిలో కమిషన్ పరిధిలో ఉన్న అంశాలను నమోదు చేసి పరిశీలిస్తున్నామని తెలిపారు.
కమిషన్ పరిధిలోకి నేరుగా రాని అంశాలు వచ్చినప్పటికీ, ప్రజల వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే దిశగా వాటిని కూడా రికార్డులో పొందుపరుస్తున్నామన్నారు. ప్రజల సమస్యలు, డిమాండ్లను స్వయంగా విన్నప్పుడే వాస్తవ పరిస్థితులు పూర్తిగా అర్థమవుతాయని పేర్కొంటూ, అందరితో సంప్రదింపులు జరుపుతూ పారదర్శక విధానంలో కమిషన్ పని కొనసాగుతోందన్నారు.
బీసీలకు సంబంధించిన సమగ్ర, ఖచ్చితమైన డేటాను అందించాలని చైర్మన్ అధికారులకు సూచించారు. వివిధ ప్రభుత్వ పథకాలలో బీసీల కవరేజీపై సమగ్ర సమాచారం అవసరమని చైర్మన్ పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీలు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారు, వారి విద్యా స్థాయి, సామాజిక–ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలపై గుణాత్మక నివేదిక (క్వాలిటేటివ్ రిపోర్ట్) కూడా ఉపయోగకరంగా ఉంటుందని చైర్మన్ అభిప్రాయపడ్డారు.
జిల్లాలో విద్యాపరమైన సమస్యలు, విద్యార్థుల డ్రాపౌట్స్ (బడి మానివేత) వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ విషయాలకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ 1987 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఆంధ్రప్రదేశ్–తెలంగాణ క్యాడర్‌లో వివిధ కీలక శాఖల్లో విశిష్ట సేవలు అందించారని తెలిపారు.
ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD), హౌసింగ్, ఇరిగేషన్ వంటి ప్రధాన విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో కూడా ఆయన విశేష పాత్ర పోషించారన్నారు. ప్రస్తుతం ఏపీ డెడికేటెడ్ కమిటీ చైర్‌పర్సన్‌గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా మరియు వెనుకబాటుతనo పరిస్థితులపై సమగ్ర అధ్యయనం నిర్వహిస్తున్నారని తెలిపారు.
కర్నూలు జిల్లా పరిపాలనా నిర్మాణం, జనాభా గణాంకాలు, బీసీ వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలపై కమిటీకి సమగ్ర వివరాలు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పాణ్యం నియోజకవర్గం సంబంధించిన రెండు మండలాలు ఉన్నాయని, జిల్లాలో 27 మండలాలు, 484 గ్రామపంచాయతీలు, 472 రెవెన్యూ గ్రామాలు, 672 స్వర్ణ గ్రామాలు/వార్డులు ఉన్నాయన్నారు.
అదే విధంగా ఒక మున్సిపల్ కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ కలిపి మొత్తం నాలుగు అర్బన్ లోకల్ బాడీలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతం 59.89 కాగా, బీసీల అక్షరాస్యత 64.98 శాతంగా నమోదైందన్నారు. అర్బన్ జనాభా 32 శాతం, గ్రామీణ జనాభా 67 శాతం, జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటరుకు 296 మంది, లింగ నిష్పత్తి 990గా ఉందని తెలిపారు.
జిల్లాలో బీసీ వర్గాల జనాభా సుమారు 50 నుండి 60 శాతం వరకు ఉందని వివరించారు. ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక మేయర్, నలుగురు చైర్‌పర్సన్లు, 13 జడ్పీటీసీలు, 256 ఎంపీటీసీలు, 14 ఎంపీపీలు, 78 వార్డు సభ్యులు/కౌన్సిలర్లు, 286 మంది సర్పంచులు కలిపి మొత్తం 657 మంది బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారని తెలిపారు. జిల్లాలో ముఖ్యంగా వాల్మీకి బోయ, ముస్లిం షేక్, కురుబ, యాదవ, దూదేకుల, గౌడ, రజక, వడ్డే తదితర బీసీ వర్గాలు అధికంగా నివసిస్తున్నాయని కలెక్టర్ వివరించారు. అనంతరం కుల సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు మరియు ప్రజల నుండి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ విన్నతులను స్వీకరించారు.
సమావేశంలో డెడికేటెడ్ కమిషన్ సెక్రెటరీ రాజు, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, జిల్లా పరిషత్ సీఈఓ రమణ రెడ్డి, సిపిఓ భారతి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, డిపిఓ భాస్కర్, సర్వ శిక్ష అభియాన్ పీవో లోక్ రాజ్, ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగి రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి ప్రసూన, డి సి ఎం ఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, రజక కార్పొరేషన్ చైర్ పర్సన్ సావిత్రి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్, ఉప్పర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసాద్, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బయ్య, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




