Nandyal: కృష్ణా తీరం సిద్దేశ్వరంలో హెల్త్ రిసార్ట్. జిల్లాలో 22 ప్రధాన పర్యాటక ప్రాంతాల గుర్తింపు
Nandyal: ఏపీలో 200 పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Nandyal: కృష్ణా తీరం సిద్దేశ్వరంలో హెల్త్ రిసార్ట్. జిల్లాలో 22 ప్రధాన పర్యాటక ప్రాంతాల గుర్తింపు
నంద్యాల: రాష్ట్రంలో అద్భుతమైన సందర్శనీయ పర్యాటక ప్రాంతాలను 200 వరకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. పర్యాటకుల సౌకర్యాలు, సదుపాయాల కల్పనపై పూర్తి వివరాలతో ఐదు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యాటక, అటవీ, ఏకో టూరిజం కార్యదర్శులను ఆదేశించారు. ఈ క్రమంలో.. నంద్యాల జిల్లాలో పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ, ఆత్మకూరు నల్లమల పెద్దపులుల అభయారణ్యం అంచుల్లో.. మరోవైపు కృష్ణానది తీర ప్రాంతం సంగమేశ్వరం సమీప సిద్దేశ్వరం అటవీ ప్రాంతంలో హెల్త్ రిసార్ట్ ను ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా ఏర్పాటు చేయనుంది.
శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు అనుకూలమైన ప్రకృతి సహజ సిద్ధ వాతావరణం సిద్దేశ్వరం అడవుల్లో ఉంది. స్వచ్ఛమైన ప్రాణవాయువు, ఆహ్లాదకర నదీ పరివాహక గాలులు, ఔషధ గుణాల జలాలతో కూడిన సిద్దేశ్వరం తీరంలో త్వరలోనే పర్యాటక భవంతుల నిర్మాణం జరగనుంది. నంద్యాల జిల్లాలో 22 పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రణాళికలను జిల్లా అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించారు.
పర్యాటకులు కేవలం శైవ క్షేత్రాలకే పరిమితం కాకుండా భౌగోళిక, చారిత్రక, విజ్ఞాన పరిశోధక ప్రాంతాలలో పర్యటించేలా వసతుల కోసం డైవిక్, వీటి యస్ వసతి సంస్థలకు స్థలాలు కేటాయించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తరించిన నల్లమల అరణ్యాల మధ్య ప్రవహిస్తున్న కృష్ణానది ఒడ్డు నున్న సిద్దేశ్వరం పర్వతంపై నల్లమలలో లభించే విలువైన అరుదైన వనమూలికలు, ఆకుపసరు ఆయుర్వేద గుణాలున్న ప్రకృతి వైద్యాన్ని సిద్దేశ్వరం కేంద్రంగా పర్యాటకులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకురానుంది. మానసిక, శారీరక రుగ్మతల చికిత్స కేంద్రంగా కూడా ఉపయోగపడనుంది.
2016 కృష్ణ పుష్కరాల సమయంలో పర్యాటకశాఖ సంగమేశ్వరంలో ఏపీ టూరిజం అద్దాల హోటల్ ను నిర్మించింది. అప్పటి కర్నూలు ఉమ్మడి జిల్లా కలెక్టర్ సిహెచ్. విజయ మోహన్ సంగమేశ్వరం నుంచి శ్రీశైలానికి పర్యాటక బోటు ప్రయాణానికి ప్రత్యేక పడవను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఆత్మకూరు నుంచి సంగమేశ్వరం వరకు 40 కిలోమీటర్ల తారు రోడ్డును నిర్మించారు. పుష్కర ఘాట్ల నిర్మాణం జరిగింది. ప్రాచీన సంగమేశ్వర ఆలయాలు పునః నిర్మించబడ్డాయి.
అలాగే భారతదేశంలో రెండవది, ఆంధ్రప్రదేశ్లో ఏకైక సరస్వతీ ఆలయం కొలను భారతి క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆలయ నూతన నిర్మాణ పనులు అప్పుడు ప్రారంభించినవే. పదేళ్లు గడుస్తున్నా ఇటు పర్యాటకశాఖ కానీ, అటు దేవాదాయ శాఖ కానీ .. క్షేత్రాన్ని దత్తత తీసుకున్న శ్రీశైల దేవస్థానం కానీ కొలను భారతి క్షేత్రాన్ని ఏ రకంగా కూడా అభివృద్ధి చేసి చూపించలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సంగమేశ్వరానికి కూత వేటు దూరంలో కృష్ణా నదికి అవతలి ఒడ్డున ఉన్న సోమశిలను తెలంగాణ హరిత పర్యాటకశాఖ అత్యద్భుతంగా అభివృద్ధి చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయరాబడి సోమశిల పర్యాటక ప్రాంతం నుంచి సమకూరుతుంది. తెలంగాణ పర్యాటక రంగం తరహాలో సిద్దేశ్వరం, సంగమేశ్వరం, కొలను భారతి ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఈ ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు విమర్శిస్తున్నారు.
తెలంగాణ కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు రూ. 1200 కోట్లతో జాతీయ రహదారి 167 కే నిర్మిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై సిద్దేశ్వరం వద్ద రెండు కొండల మధ్య తీగల వంతెన నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సిద్దేశ్వరం వద్ద పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత అభివృద్దె కాక ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరుతుంది. త్వరతగతిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.




