Nandyala: ఎమ్మెల్యే అఖిలప్రియకు భూమా కిశోర్ రెడ్డి ఓపెన్ డిబేట్ ఛాలెంజ్!
Nandyala: నంద్యాల జిల్లా అహోబిలం టెంపుల్ టోల్‌గేట్లు, తలనీలాల కాంట్రాక్టుల అక్రమ వసూళ్లపై ఎమ్మెల్యే అఖిలప్రియపై భూమా కిశోర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
Nandyala: ఎమ్మెల్యే అఖిలప్రియకు భూమా కిశోర్ రెడ్డి ఓపెన్ డిబేట్ ఛాలెంజ్!
Nandyala: అహోబిలం వివాదంపై భూమా కిశోర్ రెడ్డి ఫైర్..ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు డిబేట్ ఛాలెంజ్.. టోల్‌గేట్లు, తలనీలాల కాంట్రాక్టులు, అక్రమ వసూళ్లు పై తీవ్ర ఆరోపణలు.
నంద్యాల జిల్లా అహోబిలం వ్యవహారంపై రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. అహోబిలంలో టోల్‌గేట్లు, తలనీలాల కాంట్రాక్టులు, అక్రమ వసూళ్లు, ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిశోర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను లక్ష్యంగా చేసుకుని పలు ప్రశ్నలు సంధించిన ఆయన.. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.
హెచ్ఎంటీవీ తో భూమా కిశోర్ రెడ్డి మాట్లాడుతూ అహోబిలం వివాదం కొత్తది కాదని, గత కొన్ని నెలలుగా అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని భూమా కిశోర్ రెడ్డి అన్నారు. ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటుండటంతోనే తాము స్పందించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
అహోబిలంలో టోల్‌గేట్లు, తలనీలాల వ్యవహారం, తిరునాళ్ల సమయంలో స్థలాల కేటాయింపుల్లో భారీ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారాల వల్లే ఆలయ ప్రతిష్ఠ దిగజారుతోందని విమర్శించారు.
ఈ అంశాలపై చాలా రోజులుగా పోరాడుతున్నామని, తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల తలనీలాలు తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్న ఘటన కూడా తమ ఆరోపణలకు బలం చేకూరుస్తోందన్నారు.
గుంటూరు శ్రీను వ్యవహారాన్ని ప్రస్తావించిన భూమా కిశోర్ రెడ్డి.. అతనికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఆమె పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు.
రెండేళ్లుగా అవినీతి గురించి మాట్లాడుతున్నారని చెప్పే అఖిలప్రియ.. ఒక్క కుంభకోణాన్నైనా బయటపెట్టారా అని ప్రశ్నించారు. ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమే జరుగుతోందని విమర్శించారు..
మఠం అంతర్గత వ్యవహారాలతో తమకు సంబంధం లేదని, ప్రజలను ఇబ్బంది పెట్టే అంశాలపైనే వైఎస్సార్‌సీపీ స్పందిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల నుంచి అక్రమంగా వసూళ్లు చేయడం ప్రజా సమస్య అని పేర్కొన్నారు.
గతంలో అహోబిలం టోల్‌గేట్లను ఉచితం చేస్తానని అఖిలప్రియ ఇచ్చిన హామీని గుర్తు చేసిన భూమా కిశోర్ రెడ్డి.. అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే టోల్‌గేట్లను ఉచితం చేస్తామని ప్రకటించారు.
ఆళ్లగడ్డ ప్రజలు, రైతులు కూడా అహోబిలానికి వెళ్లాలంటే టోల్ చెల్లించాల్సిన పరిస్థితి దారుణమని విమర్శించారు. ప్రజలను దోచుకుంటూ తమకు సంబంధం లేదని చెప్పడం సరికాదన్నారు.
తమ ఆరోపణలు తప్పని భావిస్తే చట్టపరంగా ముందుకు రావాలని అఖిలప్రియకు సవాల్ విసిరారు. ఇంటికి వస్తానంటూ హెచ్చరికలు చేయడం కంటే, టీవీ ఛానళ్ల వేదికగా బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు అన్యాయం జరిగితే పార్టీ మొత్తం అండగా నిలుస్తుందని పేర్కొన్న భూమా కిశోర్ రెడ్డి.. అఖిలప్రియ అవినీతికి పాల్పడలేదని ఆమె పార్టీ ఎమ్మెల్యేలతో ఒక్కరినైనా చెప్పించాలని సవాల్ చేశారు.
చివరిగా.. ఇసుక, మట్టి అక్రమాలపై సొంత అనుకూల మీడియాలోనే కథనాలు వస్తున్నాయని పేర్కొంటూ.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం బాధాకరమని భూమా కిశోర్ రెడ్డి వ్యాఖ్యానించారు.




