Banaganapalle: బనగానపల్లె ఏరియా ఆసుపత్రిలో ఐపీహెచ్ ల్యాబ్ ప్రారంభం: మంత్రి బీసీ

Banaganapalle: బనగానపల్లె ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ₹1.25 కోట్లతో ఐపీహెచ్‌ఎల్, అదానీ ఫౌండేషన్ సమకూర్చిన ₹1.57 కోట్ల వైద్య పరికరాలను మంత్రి బీసీ, ఎంపీ శబరి ప్రారంభించారు.

Ramanaiah, Banaganepalle
Published on: 12 Sept 2026 3:30 PM IST
Banaganapalle
X

Banaganapalle: బనగానపల్లె ఏరియా ఆసుపత్రిలో ఐపీహెచ్ ల్యాబ్ ప్రారంభం: మంత్రి బీసీ

నంద్యాల జిల్లా: బనగానపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ.1.25 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ (ఐపీహెచ్‌ఎల్)తో పాటు, అదానీ ఫౌండేషన్ సీఎస్ఆర్ నిధులు రూ.1.57 కోట్లతో సమకూర్చిన ఆధునిక వైద్య పరికరాలను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు.

అనంతరం మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బనగానపల్లె నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు వైద్య పరీక్షలు, చికిత్సల కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందేలా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ఐపీహెచ్‌ఎల్ అందుబాటులోకి రావడంతో వివిధ రకాల వైద్య పరీక్షలను మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం కలుగుతుందని, అత్యాధునిక వైద్య పరికరాల వినియోగంతో రోగులకు వైద్య పరీక్షలు, చికిత్స మరింత సులభతరం కానున్నాయని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చేందుకు అదానీ ఫౌండేషన్ చైర్మన్‌కు రూ.3 కోట్ల సీఎస్ఆర్ నిధులు మంజూరు చేయాలని తాను రాసిన లేఖకు స్పందిస్తూ మొదటి విడతగా రూ.1.57 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను అందించారని తెలిపారు.

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య పరికరాల ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య పరీక్షలు, మెరుగైన చికిత్స అందించే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యతను పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందన్నారు.

మా విజ్ఞప్తికి వెంటనే స్పందించి CSR నిధులు మంజూరు చేసి, విలువైన వైద్య పరికరాలను అందించిన అదానీ గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్‌కు, సంస్థ ప్రతినిధులకు వైద్యులు, బనగానపల్లె నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో అంకితభావంతో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బనగానపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాదేవి, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle