Nandyal: నంద్యాలలో డ్రగ్స్ వ్యతిరేక సదస్సు.. అప్రమత్తంగా ఉండాలన్న ఏఎస్పీ!
Nandyal: మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
Nandyal: నంద్యాలలో డ్రగ్స్ వ్యతిరేక సదస్సు.. అప్రమత్తంగా ఉండాలన్న ఏఎస్పీ!
నంద్యాల: మాదక ద్రవ్యాల దుర్వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, ప్రతి విద్యార్థి డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ మందా జావలి సూచించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా నంద్యాలలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.
మాదక ద్రవ్యాల దుర్వినియోగం సమాజానికి పెద్ద ముప్పుగా మారుతున్న నేపథ్యంలో, యువతలో అవగాహన పెంచేందుకు నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ మందా జావలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఏఎస్పీ మందా జావలి… డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు మొదట సరదాగా మొదలై, తరువాత జీవితాన్నే నాశనం చేసే స్థాయికి తీసుకెళ్తాయని హెచ్చరించారు. ఒకసారి అలవాటు పడితే బయటపడటం చాలా కష్టమని, మాదక ద్రవ్యాలు శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక స్థితిని కూడా తీవ్రంగా దెబ్బతీస్తాయని వివరించారు.
విద్యార్థి దశలో సరైన లక్ష్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. క్షణిక ఆనందం కోసం డ్రగ్స్ వైపు ఆకర్షితులై బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రుల ఆశలు, సమాజం నమ్మకాన్ని నిలబెట్టేలా చదువుపైనే పూర్తి శ్రద్ధ పెట్టాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
అనుమానాస్పదంగా ఎవరైనా మాదక ద్రవ్యాల విక్రయం లేదా వినియోగం చేస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాజం మొత్తం కలిసి పనిచేస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీరామకృష్ణ విద్యాసంస్థల అకాడమిక్ డీన్ ప్రగతి రెడ్డి కూడా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రమశిక్షణతో కూడిన జీవనం విజయానికి పునాది అని, డ్రగ్స్ వంటి సామాజిక దుష్ప్రవర్తనలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా అవగాహన ప్రతిజ్ఞ చేశారు.
మాదక ద్రవ్యాలపై యువతలో అవగాహన పెంచడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సదస్సు విద్యార్థుల్లో మంచి స్పందన తెచ్చింది. డ్రగ్స్‌కు దూరంగా ఉండి విద్య, లక్ష్యాలపై దృష్టి పెట్టాలని అధికారులు స్పష్టం చేశారు.




