Allagadda: రోడ్డు భద్రతపై కలెక్టర్, ఎమ్మెల్యే హైలెవెల్ మీటింగ్
Allagadda: జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా కలెక్టర్ జి.గణియా, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
Allagadda: రోడ్డు భద్రతపై కలెక్టర్, ఎమ్మెల్యే హైలెవెల్ మీటింగ్
Allagadda: ఆళ్లగడ్డ పట్టణ పరిసర ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా ఆదేశించారు. శుక్రవారం ఆళ్లగడ్డ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ చర్యల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల ప్రాజెక్ట్ డైరెక్టర్ అశోక్, ప్రాజెక్ట్ మేనేజర్ మదన్మోహన్ తదితర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హైవేలపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత డీఆర్ఎస్సీ సమావేశంలో సూచించిన చర్యల అమలుపై అధికారులు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటివరకు పూర్తి చేసిన పనులకు సంబంధించిన ఫోటోలు, వివరాలను అందించాలని సూచించారు. హైవేలపై రేడియం లైటింగ్ లేకపోవడం వల్ల రాత్రి వేళల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు.
ఈ విషయమై గత సమీక్ష సమావేశంలో సూచించినప్పటికీ ఇంకా లైటింగ్ ఏర్పాట్లు పూర్తి కాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాల్లో తక్షణమే రేడియం సైన్‌బోర్డులు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హైవే పక్కన నిర్మాణంలో ఉన్న కల్యాణ మండప సముదాయాలకు క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే అనుమతులు జారీ కావడంపై కలెక్టర్ ప్రశ్నించారు. ప్రజల భద్రతకు భంగం కలగకుండా అన్ని అనుమతులు నిబంధనల ప్రకారమే ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ జాతీయ రహదారుల వెంట వాహనాలు నిర్లక్ష్యంగా నిలిపివేయడం, అనధికారికంగా ఏర్పడుతున్న దాబాలు కూడా ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు ఇప్పటికే కొన్ని అనధికార దాబాలను మూసివేసినట్లు తెలిపారు. ఈ తరహా అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. తిరుపతి వైపు నుంచి వచ్చే వాహనదారులు రాత్రి వేళల్లో నిద్రమత్తులో ప్రయాణించడం, రాంగ్ రూట్లో రావడం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని నేషనల్ హైవే పిడి వివరించారు.
ఈ నేపథ్యంలో హైవేలపై ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఆర్ అండ్ బి రోడ్డు - హైవే కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు, తగినంత లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. రోడ్డు విస్తరణకు సంబంధించిన కొన్ని పనులు కోర్టు పరిధిలో ఉన్న కారణంగా నిలిచిపోయినట్లు పీడీ కలెక్టర్‌కు వివరించారు. రోడ్డు భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రజల ప్రాణ రక్షణే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.




