Vuyyuru: ఉయ్యూరు శాంతి థియేటర్‌లో పార్కింగ్, ఫుడ్ ధరలపై ప్రేక్షకుల అసంతృప్తి

Vuyyuru: ఉయ్యూరు శాంతి థియేటర్‌లో అధిక పార్కింగ్ ఫీజు, ఆహార పదార్థాల ధరలపై ప్రేక్షకుల ఆగ్రహం. అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టాలని స్థానికులు డిమాండ్.

Ramana, Penamaluru
Published on: 23 Aug 2026 10:53 AM IST
Vuyyuru
X

Vuyyuru: ఉయ్యూరు శాంతి థియేటర్‌లో పార్కింగ్, ఫుడ్ ధరలపై ప్రేక్షకుల అసంతృప్తి

Vuyyuru: సినిమా వినోదం పేరుతో ప్రేక్షకులపై అదనపు భారాన్ని మోపుతున్నారనే ఆరోపణలు ఉయ్యూరులోని శాంతి థియేటర్‌పై వినిపిస్తున్నాయి. థియేటర్‌లో ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారని, దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

ఇదిలా ఉండగా, థియేటర్‌లో ఫుడ్ ధరలపైనా ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు ఎగ్ పఫ్స్‌కు రూ.80 వసూలు చేసినట్లు చూపిస్తున్న ఆన్‌లైన్ చెల్లింపు స్క్రీన్‌షాట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రూ.80 చెల్లింపు పఫ్స్‌కేనా, ఇతర వస్తువులకు కలిపినా అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. సంబంధిత బిల్లు, ధరల పట్టికను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్ ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం G.O.Ms.No.44ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో పార్కింగ్ వ్యవధి ఆధారంగా ఫీజు వసూలుపై మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే ఈ ఉత్తర్వుల అమలుపై 2025లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయపరమైన వివాదం కూడా జరిగింది. హైకోర్టు ఒక దశలో ఆ G.O. అమలును 12 వారాలపాటు నిలిపివేసింది.

ఈ నేపథ్యంలో ఉయ్యూరు శాంతి థియేటర్‌లో ప్రస్తుతం వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజు ఏ నిబంధనల ప్రకారం వసూలు చేస్తున్నారు? థియేటర్ యాజమాన్యానికి సంబంధిత అనుమతులు ఉన్నాయా? ప్రేక్షకుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులకు సరైన రశీదులు, ధరల పట్టిక ప్రదర్శిస్తున్నారా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మండల రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారులు ఈ విషయంపై క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుచున్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story