Vuyyuru: ఉయ్యూరులో డీజే రహితంగా వినాయక నిమజ్జన ఊరేగింపులు!

Vuyyuru: ఉయ్యూరులో డీజే రహితంగా వినాయక నిమజ్జనాలు నిర్వహించేందుకు మండపాల నిర్వాహకుల నిర్ణయం. సంప్రదాయ వాయిద్యాలు, కళారూపాలతో ఊరేగింపులకు ప్రజల హర్షం.

Ramana, Penamaluru
Published on: 10 Sept 2026 9:26 PM IST
Vuyyuru
X

Vuyyuru: ఉయ్యూరులో డీజే రహితంగా వినాయక నిమజ్జన ఊరేగింపులు!

ఉయ్యూరు: ఉయ్యూరు పట్టణంలో ఈ ఏడాది గణేష్ నిమజ్జన ఊరేగింపులను డీజేలు లేకుండా, సంప్రదాయబద్ధంగా నిర్వహించే దిశగా వినాయక మండపాల నిర్వాహకులు సూత్రప్రాయ అంగీకారానికి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే ఉయ్యూరు పట్టణం ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లవుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉయ్యూరు పట్టణ భౌగోళిక పరిస్థితులు, వాణిజ్య కార్యకలాపాలు, జనసాంద్రత, నిత్యం ఉండే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుంటే డీజేల వల్ల ప్రజలకు కలిగే ఇబ్బంది ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా పట్టణం నడిబొడ్డున ఉన్న కాటూరు రోడ్డులో 40కి పైగా ఆసుపత్రులు ఉండటంతో, అధిక శబ్దం రోగులు, వృద్ధులు, చిన్నపిల్లలు, సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఉయ్యూరు వైద్యుల సంఘం, ఆసుపత్రుల సంఘాలు, వాకర్స్ అసోసియేషన్‌తో పాటు వివిధ పౌర సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు వినాయక మండపాల నిర్వాహకులు సానుకూలంగా స్పందిస్తున్నట్లు సమాచారం. డీజేల స్థానంలో సంప్రదాయ వాయిద్యాలు, జానపద నృత్యాలు, ఆదరణ కోల్పోతున్న భారతీయ కళారూపాలకు ప్రాధాన్యం ఇచ్చి, భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా నిమజ్జన ఊరేగింపులు నిర్వహించాలనే ఆలోచనకు మద్దతు పెరుగుతోంది.

భక్తికి అధిక శబ్దం అవసరం లేదని, సంప్రదాయం–సంస్కృతి కలగలిసిన నిమజ్జన ఊరేగింపులు మరింత ఆహ్లాదకరంగా ఉంటాయని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రయత్నం పూర్తిస్థాయిలో విజయవంతమైతే ‘డీజే రహిత గణేష్ నిమజ్జనాలు’ నిర్వహించిన పట్టణంగా ఉయ్యూరు రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story