Penamaluru: పోరంకి హెవెన్లీ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో బాధితుల ఆందోళన

Penamaluru: పెనమలూరు పోరంకిలోని హెవెన్లీ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో మౌలిక వసతులు కల్పించకుండా బిల్డర్ మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

Ramana, Penamaluru
Published on: 4 Sept 2026 8:18 PM IST
Penamaluru
X

Penamaluru: పోరంకి హెవెన్లీ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో బాధితుల ఆందోళన

పెనమలూరు: పెనమలూరు నియోజకవర్గం, పోరంకి లక్షల రూపాయలు పెట్టి సొంతింటి కలను నెరవేర్చుకున్నామని భావించిన హెవెన్లీ హైట్స్ అపార్ట్‌మెంట్‌ వాసులకు ఇప్పుడు కనీస మౌలిక సదుపాయాల కోసం పోరాటం తప్పడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చాగర్లమూడి కన్‌స్ట్రక్షన్స్‌ ఆధ్వర్యంలో నిర్మించినట్లు పేర్కొంటున్న ఈ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లు విక్రయించే సమయంలో రోడ్డు, నీటి సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని హామీలు ఇచ్చారని, అయితే ఫ్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని కొందరు నివాసితులు ఆరోపిస్తున్నారు.

హామీ ఇచ్చిన రోడ్డుకే గోడ!

అపార్ట్‌మెంట్‌కు సరైన రాకపోకల మార్గం కల్పిస్తామని చెప్పి, ప్రస్తుతం ప్రధాన రహదారి మార్గాన్ని గోడతో పూర్తిగా మూసివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సొంత ఫ్లాట్‌లో నివసిస్తున్న ప్రజలు తమ ఇళ్లకు రాకపోకలు సాగించేందుకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు.

“ఫ్లాట్‌ కొనుగోలు చేసే ముందు ఒక మాట.. కొనుగోలు చేసిన తర్వాత మరో మాట. మాకు హామీ ఇచ్చిన రహదారి ఎక్కడ?” అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు.

లీకవుతున్న వాటర్‌ ట్యాంకులు.. పట్టించుకునే నాథుడెవరు?

అపార్ట్‌మెంట్‌లో నీటి సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయని నివాసితులు వాపోతున్నారు. ఎక్కడికక్కడ వాటర్‌ ట్యాంకులు లీకేజీలు కావడం, నీటి వ్యవస్థ సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. నీటి సరఫరా, ట్యాంకుల నిర్వహణ, లీకేజీల మరమ్మతుల విషయంలో శాశ్వత పరిష్కారం చూపకుండా సమస్యను తాత్కాలికంగా వదిలేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

మెయింటెనెన్స్‌ పేరుతో నిర్లక్ష్యమా?

అపార్ట్‌మెంట్‌లో సాధారణ నిర్వహణ సక్రమంగా జరగడం లేదని, అవసరమైన పనులు ఎప్పటికప్పుడు చేపట్టకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయని వాసులు చెబుతున్నారు. డబ్బులు చెల్లించి ఫ్లాట్‌ కొనుగోలు చేసిన తర్వాత కూడా కనీస సౌకర్యాల కోసం అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని వారు నిలదీస్తున్నారు.

సమస్య అడిగితే బెదిరింపుల ఆరోపణలు

తమ సమస్యలను అపార్ట్‌మెంట్‌ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పుడు పరిష్కారం చూపాల్సిందిపోయి, ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కొందరు నివాసితులు ఆరోపిస్తున్నారు. “మా సమస్యలు పరిష్కరించండి” అని అడగడం కూడా తప్పేనా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

అధికారులు స్పందించాలి

హెవెన్లీ హైట్స్‌లో నెలకొన్న సమస్యలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గు తేల్చాలని బాధితులు కోరుతున్నారు. అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, హామీ ఇచ్చిన మౌలిక వసతులు, ప్రధాన రహదారి మార్గం, నీటి వ్యవస్థ, మెయింటెనెన్స్‌ తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ్లాట్‌ కొనుగోలు చేసే సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం బిల్డర్‌ బాధ్యత కాదా? ప్రజల నుంచి డబ్బులు తీసుకుని ఇళ్లు విక్రయించిన తర్వాత కనీస సౌకర్యాల కోసం ప్రజలే పోరాడాల్సిన పరిస్థితి ఎందుకు? ప్రధాన రహదారికి గోడ నిర్మించిన పరిస్థితిపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు?

అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

బాధితుల ఆరోపణలపై చాగర్లమూడి కన్‌స్ట్రక్షన్స్‌ యాజమాన్యం వివరణ ఇవ్వాల్సి ఉంది. అదే సమయంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, వాస్తవ పరిస్థితులను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story