Penamaluru: నిబంధనలు ఉల్లంఘిస్తే డీజేలు సీజ్ - పోలీసులు హెచ్చరిక

Penamaluru: పెనమలూరులో గణేష్ నవరాత్రుల సందర్భంగా డీజేల నిర్వహణపై పోలీసులు కఠిన నిబంధనలు జారీ చేసి, నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Ramana, Penamaluru
Published on: 7 Sept 2026 7:59 PM IST
Penamaluru
X

Penamaluru: నిబంధనలు ఉల్లంఘిస్తే డీజేలు సీజ్ - పోలీసులు హెచ్చరిక

పెనమలూరు: గణేష్ నవరాత్రుల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ డీజేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే సంబంధిత డీజేలను సీజ్ చేస్తామని పెనమలూరు పోలీసులు హెచ్చరించారు. సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి వేడుకలు భక్తులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు సోమవారం పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో డీజే నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

సమావేశంలో గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర, ఇన్‌స్పెక్టర్ వెంకటనారాయణ, ఎస్‌ఐలు పాల్గొని డీజే నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేశారు.

అనుమతి ఉంటేనే డీజే

గణేష్ విగ్రహ నిర్వాహకులు ఊరేగింపులకు, డీజే ప్రదర్శనకు పోలీసుల అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయాన్ని డీజే నిర్వాహకులు ముందుగానే నిర్ధారించుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా డీజేలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రోడ్లపై ప్రమాదాలకు తావివ్వొద్దు

డీజే బాక్సులు అమర్చిన వాహనం వాహనం ఎత్తు, వెడల్పులకు మించి బయటకు పొడుచుకు రాకూడదని సూచించారు. ఇరుకైన వీధుల్లో ఊరేగింపులు నిర్వహించే సమయంలో విద్యుత్, కేబుల్ వైర్లకు డీజే బాక్సులు తగలకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

డీజే వాహనం కారణంగా ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. డ్రైవర్, డీజే ఆపరేటర్ మద్యం సేవించి విధుల్లో ఉండకూడదని, బందోబస్తులో ఉన్న పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

సౌండ్ విషయంలో హద్దులు దాటితే చర్యలు

నిర్దేశించిన శబ్ద పరిమితిని ఏమాత్రం మించకూడదని పోలీసులు తేల్చిచెప్పారు. నిర్దేశించిన సమయం ముగిసిన వెంటనే డీజేను నిలిపివేయాల్సిందేనని స్పష్టం చేశారు.

అధిక శబ్దంతో డీజేలు నిర్వహించడం వల్ల విద్యార్థుల చదువుకు, ప్రజల ప్రశాంతతకు తీవ్ర భంగం కలుగుతోందని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, గర్భిణులు, చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.

రెచ్చగొట్టే పాటలు, డైలాగులకు నో!

మతాలు, కులాలు, వర్గాలు లేదా రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే పాటలు, డైలాగులు, ఇతర అభ్యంతరకర అంశాలను డీజేలలో ప్లే చేయరాదని పోలీసులు స్పష్టం చేశారు. వేడుకల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు.

ఆకతాయిల కోరికలకు తలొగ్గితే డీజే సీజ్

డీజే వద్దకు చేరే కొద్దిమంది ఆకతాయిల కోరికల కోసం, లేదా గణేష్ విగ్రహ నిర్వాహకుల ఇష్టానుసారం పోలీసుల సూచనలకు విరుద్ధంగా డీజే యాజమాన్యం, సిబ్బంది వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.

ప్రజలకు అసౌకర్యం కలిగించేలా నిబంధనలు ఉల్లంఘించిన డీజేలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా సీజ్ చేస్తామని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు డీజే నిర్వాహకులకు పోలీసులు నోటీసులు అందజేశారు.

గణేష్ నవరాత్రులు భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవడమే లక్ష్యమని, ప్రజల భద్రత, ప్రశాంతతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకూ తావులేదని పోలీసులు స్పష్టం చేశారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story