Kankipadu: డయేరియా బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్
Kankipadu: కంకిపాడు మండలంలో నమోదైన డయేరియా కేసుల నేపథ్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి బాధితులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పరామర్శించారు.
Kankipadu: డయేరియా బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్
కంకిపాడు: కంకిపాడు మండలం పరిధిలోని పునాదిపాడు, గొల్లగూడెం,కోలవెన్ను,ఉప్పులూరు,గోసాల, కొణతనపాడు తదితర ప్రాంతాల్లో నమోదైన డయేరియా కేసుల నేపథ్యంలో పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే,రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కంకిపాడు పరిసర ప్రాంతాల్లో డయేరియా నియంత్రణకు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందని,ప్రజల ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు.
పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు 25 డయేరియా కేసులు నమోదయ్యాయి. 13 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా,ఇద్దరు ఔట్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 10 మంది ఇన్‌పేషెంట్లుగా కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రోగులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అవసరమైతే ఉన్నత స్థాయి వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. గ్రామాల్లో పారిశుధ్య పనులను ముమ్మరం చేయడంతో పాటు తాగునీటి పైప్‌లైన్ల నుంచి నీటి నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించామని ఎమ్మెల్యే తెలిపారు,భూగర్భ జలాల పరిస్థితిపై జియాలజిస్టులు,DMHO, జిల్లా కలెక్టర్‌తో అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారని చెప్పారు.
ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కంకిపాడు ప్రాంతంలోని మాంసం దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్, స్ట్రీట్‌ఫుడ్ బండ్లను 2–3 రోజుల పాటు తాత్కాలికంగా మూసివేయాలని సూచించినట్లు తెలిపారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని,రాత్రి వేళల్లో కూడా వైద్యులు,అదనపు సిబ్బంది, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రజలకు ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి
ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు కోరారు,ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని,వాంతులు,విరోచనాలు తదితర లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు.
ప్రజల ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది,డయేరియాను పూర్తిగా నియంత్రించే వరకు అధికార యంత్రాంగంతో కలిసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు స్పష్టం చేశారు.




